కలం డెస్క్: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నవీన్ యాదవ్(Naveen Yadav) ఎట్టకేలకు తన కోరికను నెరవేర్చుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ దాదాపు 42 వేల ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. తెలుగుదేశం తరఫున పోటీ చేసిన మాగంటి గోపీనాధ్(Maganti Gopinath) చేతిలో ఓడిపోయారు. రెండోసారి స్వతంత్ర అభ్యర్థిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ ఆయన చేతిలోనే ఓడిపోయి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రెండుసార్లు వరుస ఓటములు ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయనలో మరింత కసిని పెంచింది. ఆ పట్టుదల, నిత్యం ప్రజల్లో ఉండే స్వభావం ఇప్పుడు ఆయనను ఎమ్మెల్యేని చేసింది.
గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజారుద్దీన్ 64 వేల ఓట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఈసారి నవీన్ యాదవ్(Naveen Yadav)కు మాత్రం భారీ మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ ఎన్నడూ రానంత ఎక్కువ మార్జిన్‌ను (24,711 ఓట్లు) సొంతం చేసుకున్నారు. ఓటమి నేర్పిన గుణపాఠంతో ఎలాంటి హోదా, అధికారం లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ వారి విశ్వాసాన్ని చూరగొన్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆయనను రౌడీ అని బహిరంగంగా సంబోధించినా, అనేక ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను అంటిపెట్టుకుని ఉన్న నవీన్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా వారి మధ్యకు వెళ్ళనున్నారు.
Read Also: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం
Follow Us on : Pinterest

