కలం, డెస్క్ : ఒడిశాలోని (Odisha) కలాహండి జిల్లా పరమానందపురంలోని రెడ్ క్రాస్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ స్కూల్ లో చదువుకుంటున్న అంధ, మూగ, చెవిటి విద్యార్థులపై వార్డెన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వార్డెన్ సంద్యాదర్శన్ మహాపాత్ర తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలురు, బాలికలు స్వయంగా ఆరోపించారు. బాలికలను అసభ్యకరంగా తాకడం, ఇష్టం వచ్చినట్టు లాగడం లాంటివి చేస్తున్నాడని.. అతనిపై ఫిర్యాదు చేస్తే తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మూగ బాలికలు చేతి సైగల ద్వారా వార్డెన్ సంద్యాదర్శన్ వేధింపుల గురించి వివరించిన వీడియోలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఒక వీడియోలో వార్డెన్ అసభ్యకరంగా బాలిక వెనక భాగం, భుజాన్ని తాకుతున్నట్టు కనిపిస్తోంది. మరో ఫొటోలో స్కూల్ లోనే బాలికను ఇష్టారీతిన పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఘటనపై కలాహండి జిల్లా బాలల రక్షణ అధికారి శైలేందు మహాపాత్ర స్పందించారు. ఘటనకు సంబంధించి ఫిర్యాదులు అందాయని.. విచారణ కోసం జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read Also: నరవణే రాతలపై ఢీ అంటే ఢీ
Follow Us On: Instagram


