కలం, డెస్క్ : కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ను (Union Budget) నేడు ప్రవేశ పెట్టింది. అయితే ఈ సారి వరాలు, వడ్డింపుల జోలికి పోకుండా పూర్తిగా వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా బడ్జెట్ తెస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేస్తున్న టారిఫ్ లు ఇండియాలోని అనేక రంగాలపై ఎఫెక్ట్ పడింది. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే అనేక రంగాలు తీవ్రంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. వాటికి ఊరట ఇచ్చే విధంగా ఈ సారి పన్ను సుంకాలలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా జౌళి రంగం, సీఫుడ్ లాంటి ఎగుమతులకు మంచి ఊరట కలిగింది. ప్రపంచ దేశాలపై ప్రతి దానికి ఆధారపడకుండా మేకిన్ ఇండియాకు ఊతం ఇచ్చేలా కొన్ని ముడి వస్తువుల దిగుమతులపై కూడా సుంకాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.
ఆ దిగుమతులపై..
అమెరికాకు మన దేశం నుంచి జౌళి, సీఫుడ్ రంగాల నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ రంగాలకు ఊతం ఇచ్చేలా.. జౌళి, సీఫుడ్ పరిశ్రమల్లో సుంకంలేని దిగుమతుల పరిమితిని 1 శాతం నుంచి 3 శాతానికి పెంచింది కేంద్రం. అంటే ఇంతకు ముందు కంటే అదనంగా రెండు శాతం దిగుమతులకు సుంకాలు ఉండవు. లెదర్, సింథటిక్, ఫుట్ వేర్ లాంటి ముడిపదార్థాలపై సుంకాల మినహాయింపు ఎప్పటిలాగే కొనసాగుతుంది. మైక్రో ఓవెన్ల తయారీకి వాడే ముడిసరుకులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ విడిభాగాలు, సోలార్ గ్లాస్ లో వాడే యాంటీమోనేట్ దిగుమతులపై కూడా సుంకాల నుంచి మినహాయింపు కల్పించింది కేంద్రం. ఫిషింగ్ బోట్లకు చేపల వేట మీద సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు.
రక్షణ రంగానికి ఊతం..
ఇంకోవైపు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆపరేషన్ సిందూర్ జరిగిన తీరును బట్టి.. భారత్ రక్షణ రంగానికి ఊతం ఇచ్చేలాకేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అను విద్యుత్ ప్రాజెక్టులకు అవసరం అయ్యే ముడి సరుకుల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు 2035 వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపింది కేంద్రం. అలాగే రక్షణ రంగానికి సంబంధించిన విమానాల తయారీకి అవసరం అయ్యే విడి భాగాల దిగుమతులపై, రక్షణ రంగంలో శిక్షణలపై కూడా కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులను కల్పించింది కేంద్రం. భవిష్యత్ లో భారత్ మీద ఏ దేశం యుద్ధానికి దిగినా సమర్థవంతంగా ఎదుర్కునేలా రక్షణ రంగాన్ని తయారు చేయాలని కేంద్రం భావిస్తోందని వీటిని బట్టి అర్థం అవుతోంది.
జౌళి రంగానికి ఊరట..
జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్ (Union Budget) లో మంచి ప్రోత్సాహకాలు దక్కాయి. ఫైబర్, జనపనార, సిల్క్, ఉన్ని ముడి సరుకుల కోసం ‘నేషనల్ ఫైబర్ స్కీమ్’ ను ప్రకటించారు. ఇంకోవైపు క్లస్టర్లను డెవలప్ చేసేందుకు గాను ‘టెక్స్ టైల్ ఉపాధి పథకం’ ను ప్రతిపాదించింది కేంద్రం. ఇలా అమెరికాకు ఎక్కువగా మన దేశం నుంచి వెళ్లే జౌళి రంగ పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.


