కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ పరిధిలోని మేళ్ల చెరువు సాక్షిగా సాగుతున్న భారీ అక్రమాలకు హైడ్రా (Hydra) చెక్ పెట్టింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. చెరువు ఎఫ్.టి.ఎల్ పరిధిలో వేల లారీల మట్టి, బండరాళ్లను నింపి భూమి స్వరూపాన్నే మార్చేందుకు ప్రయత్నించినట్టు అధికారులు నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో హైడ్రా (Hydra) సంచలన నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఫెన్సింగ్ వేసే ప్రక్రియను చేపట్టింది. చెరువులోకి నీరు రాకుండా అడ్డుగా నిర్మించిన గోడలను కూల్చివేస్తూ నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేస్తోంది. ఎఫ్.టి.ఎల్ పరిధిలో కేవలం పంటలు పండించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుందని, భూమి స్వభావాన్ని మార్చడం చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేశారు. మట్టి పోసి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండానే ఈ రక్షణ చర్యలు చేపట్టడం గమనార్హం.


