కలం, స్పోర్ట్స్: బ్యాటింగ్ లేదు, ఫీల్డింగ్ వల్ల కావట్లేదు.. ఇక రిటైర్ అయితే సరిపోతుంది అని విమర్శలు ఎదుర్కొన్నా మాక్స్వెల్ సూపర్ ఫామ్‌ను మళ్లీ చూస్తామంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting). ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మళ్లీ ఫామ్ అందుకుంటాడని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన బిగ్ బాష్ లీగ్ 2025–26లో మ్యాక్స్‌వెల్ 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 76 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ ఆయన గణాంకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
అయితే, మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఫామ్‌పై పాంటింగ్ సానుకూలంగా స్పందించారు. కేవలం ప్రస్తుత ఫామ్ చూసి కాకుండా, అతని అనుభవం, పరిస్థితులను బట్టి జట్టులో చోటు దక్కుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కోవడంలో మ్యాక్స్‌వెల్ దిట్ట అని, బౌలింగ్‌లోనూ ఆస్ట్రేలియాకు అదనపు ఆప్షన్ అవుతారని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ ప్రారంభంలో చిన్న జట్లతో జరిగే మ్యాచ్‌లు మ్యాక్స్‌వెల్ ఫామ్ పుంజుకోవడానికి సహాయపడతాయని ఆయన విశ్లేషించారు. మ్యాక్స్‌వెల్ ఆటను అంచనా వేయడం కష్టమని, గడిచిన ప్రపంచకప్‌లలో ఆయన సృష్టించిన అద్భుతాలే దీనికి నిదర్శనమని పాంటింగ్ గుర్తుచేశారు.


