కలం, వరంగల్ బ్యూరో : నేడు మేడారం మహా జాతర (Medaram Jatara)లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోటి మంది భక్తులు ఎదురు చూస్తున్న సమ్మక్క (Sammakka) ఆగమనం అత్యంత కోలాహలంగా కొనసాగనుంది. ఆ వనదేవతను గురువారం సాయంత్రం (జనవరి 29) కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి తీసుకొస్తారు.
కుంకుమభరిణి రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను ఆదివాసీల సంప్రదాయం ప్రకారం తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. శుక్రవారం (జనవరి 30) పెద్ద సంఖ్య లో మేడారం చేరుకొనున్న భక్తులు.. ఆ తల్లిని దర్శించుకొని ఎత్తు బంగారాలను సమర్పించడం ఆనవాయితీ. శనివారం (జనవరి 31) దేవతల వన ప్రవేశంతో మేడారం మహా జాతర ముగుస్తుంది.


