epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

బీసీ రిజర్వేషన్లపై అనుమానాలు

కలం, తెలంగాణ బ్యూరో : వెనకబడిన తరగతుల (OBC) సంక్షేమం, అభివృద్ధి, స్థానిక పరిపాలనలో వాటా తదితర అంశాలపై కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) విధానాలతో ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. జనగణనలో కులగణన చేస్తామంటూ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ గతేడాది డిసెంబరులో నిర్ణయం తీసుకున్నా అమలులో భిన్నవైఖరి కనిపిస్తున్నదనే చర్చ మొదలైంది. సెన్సస్ ఫస్ట్ ఫేజ్ కోసం రూపొందిన ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీ ప్రస్తావన తెచ్చి బీసీలను విస్మరించడంతో సందేహాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ విషయంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్‌కు (BC Reservations) లీగల్ చిక్కులుంటే పార్టీ పరంగా జనరల్ స్థానాల్లో బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వడంలేదనే ప్రశ్నలకు నాయకత్వం నుంచి సమాధానం కరువైంది. బీసీల అభివృద్ధి విషయంలో ఈ రెండు పార్టీలూ దొందూ.. దొందే.. అనే విమర్శలు ఉత్పన్నమయ్యాయి.

కేంద్రం వివరణ ఇచ్చినా సందేహాలు కంటిన్యూ :

జనగణనలో భాగంగానే కులగణన కూడా చేస్తామని కేంధ్ర సర్కారు గతేడాది డిసెంబరులోనే పేర్కొన్నది. ఫస్ట్ ఫేజ్ సెన్సస్ ప్రక్రియ ఏప్రిల్ ఫస్ట్ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఈ ఫేజ్‌లో ఇండ్ల లెక్కింపు (House Listing, Housing Census) మాత్రమే జరుగుతుందని సెకండ్ ఫేజ్‌లో జరిగే జనాభా లెక్కల సమయంలో కులగణన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతేడాది డిసెంబరులోనే ఈ నిర్ణయం జరిగిందని, అన్ని పార్టీలకూ వివరించామని గుర్తుచేసింది. అయినా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో జరిగే ఇంటింటి సర్వేలో మొత్తం 33 ప్రశ్నల్లో 12వ ప్రశ్న దగ్గర “ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు చెందినవారా?” అని ఉండడం సందేహాలకు తావిచ్చినట్లయింది. ఎస్సీ, ఎస్టీ అని పెట్టినప్పుడు అక్కడ ఓబీసీ అని ఎందుకు పెట్టలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. దీనికి వివరణగా కేంద్రం సెకండ్ ఫేజ్‌లో కులగణన ఉంటుందని స్పష్టత ఇచ్చింది.

ఇదే అంశంపై కవిత రౌండ్ టేబుల్ మీటింగ్ :

గత రెండేండ్ల నుంచీ బీసీ రిజర్వేషన్ (BC Reservations) విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడడంతో పాటు పలు పార్టీల నుంచి ఒత్తిడి పెంచేలా ప్రయత్నిస్తున్న తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న జారీచేసిన గెజిట్‌లోని 12వ ప్రశ్నను ప్రస్తావించారు. కులగణన చేయాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని, ఆ ప్రశ్నల్లో 12వదాన్ని చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే అన్ని పార్టీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జనవరి 29న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి వివిధ బీసీ సంఘాల ప్రతినిధులను సైతం ఆహ్వానించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల తరహాలోనే కేంద్రం కులగణన చేస్తుందన్న చిత్తశుద్ధిపై కవిత అనుమానాలను వ్యక్తం చేశారు. నిజంగా కులగణన చేయాలని బీజేపీ భావించినట్లయితే ఫస్ట్ ఫేజ్‌లో ఎస్సీ, ఎస్టీ గురించి ప్రశ్నలు పెట్టి అందులో ఓబీసీని ఎందుకు ప్రస్తావించలేదన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ 42% రిజర్వేషన్ హామీ :

బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ హామీపై ఇప్పటికే బీసీ సంఘాలు, పార్టీలోని బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. హామీ ప్రకారం చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం పొందలేదు. రాష్ట్రపతి పరిశీలనకు వెళ్ళింది. మరోవైపు రాజ్యాంగంలోని 9వ షెడ్యూలుకు సవరణ చేయడంపై కేంద్రం మౌనంగానే ఉన్నది. దీంతో 42% రిజర్వేషన్ అమలుకు లీగల్ చిక్కులు వచ్చాయి. దీంతో జనరల్ వార్డుల్లో బీసీ అభ్యర్థులకు పార్టీపరంగా టికెట్లు ఎందుకు ఇవ్వలేదనే అసంతృప్తి జిల్లా కాంగ్రెస్ లీడర్లలో, మున్సిపల్ ఎన్నికల ఆశావహుల్లో వ్యక్తమవుతున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వం తరఫున ఎలాంటి ప్రకటన లేకపోవడంతో బీసీ రిజర్వేషన్ల గురించి చెప్పుకోడానికే తప్ప క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదన్న అభిప్రాయం బలపడుతున్నది. కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలంటే జనరల్ స్థానాల్లోనూ బీసీలకు టికెట్లు ఇవ్వడమే ఏకైక మార్గం అనేది బీసీ ఆశావహుల అభిప్రాయం.

Read Also: బీఆర్ఎస్‌కు ట్యాపింగ్ టెన్షన్.. విచారణలతో ప్రచారంపై ప్రభావం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>