కలం, వెబ్ డెస్క్: మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితంతో చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. అటు కుటుంబ బాధ్యతలు, ఇటు వ్యక్తిగత పనులతో నిద్ర (Sleep)కు దూరమవుతున్నారు. నిద్ర తక్కువైతే అనేక వ్యాధుల బారినపడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్త్ డేటా సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల 172 వ్యాధులు ప్రభావం చూపుతాయని తేలింది.
నిద్ర లేకపోవడం వల్ల గుండె (Heart) జబ్బులు, మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం 1.5 నుండి 2 రెట్లు పెరుగుతుంది. తక్కువ నిద్రతో వాపు, నాడీ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. అలాగే శరీర అంతర్గత వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తి, జీవక్రియల అసమతుల్యతకూ దారితీస్తుంది. నిద్రలేమితో పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఏకాగ్రతను దెబ్బతీసి ఆందోళన, చిరాకు బారిన పడేలా చేస్తుంది.
మంచి నిద్ర కోసం ఏం చేయాలంటే..
- రోజూ ఒకే టైమ్‌కి పడుకోవడం, ఒకే టైమ్‌కి లేవడం అలవాటు చేసుకోండి
- పడుకునే ముందు మొబైల్, టీవీ స్క్రీన్స్‌కు దూరంగా ఉండాలి.
- గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.
- రాత్రి భోజనం త్వరగా తీసుకోవాలి.
- కాఫీ, టీలను తగ్గించాలి.
- మంచం మీద పడుకున్నాక పుస్తకం చదవడం లేదా లైట్ మ్యూజిక్ వినడం చేయాలి.


