epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

కేసీఆర్ ఫ్యామిలీలో పంపకాల పంచాయితీ: ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో: కేసీఆర్ (KCR) ఫ్యామిలీలో పంపకాల పంచాయితీ నడుస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. కేటీఆర్ తాను యువరాజునని కంటున్న కలలు మొత్తం ఛిద్రమయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడటం లేదని పేర్కొన్నారు. ఆ విబేధాలతోనే కవిత బయటకు వచ్చారని చెప్పారు. కేటీఆర్, హరీశ్, సంతోష్ రావు ఎటువంటి వారో .. ఏయే అరాచకాలు చేశారో కవితే బయటపెడుతోందని తెలిపారు. కవిత చెప్పే అంశాల్లో నిజం ఎంతుందో తెలియదు గానీ పంపకాల పంచాయితీ మాత్రం గట్టిగానే నడుస్తోందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ విర్రవీగిందని, చెప్పును నిలబెట్టినా గెలుస్తామని కేసీఆర్ అహంకారంతో ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని, స్వయంగా బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని 8 ఎంపీ స్థానాల్లో గెలిపించిందన్నారు. బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు రాకుండా చేయాలని కుట్రలు చేశారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. ఇటీవల వరసగా జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటములు చవి చూస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వస్తాయని చామల (Chamala Kiran Kumar Reddy) జోస్యం చెప్పారు.

కేటీఆర్, హరీశ్ రావువి పగటి కలలు

మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావు దుష్ప్రచారం చేశారని, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో బంధువులు, అనుచరులకు కాకుండా గెలుపు గుర్రాలకు, ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి ఇవ్వాలని.. అప్పుడు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు.

ఓవర్ కాన్ఫిడెన్స్‌ వద్దు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండొద్దని ఎంపీ చామల (Chamala Kiran Kumar) హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పథకాలను కార్యకర్తలు తీసుకువెళ్లాలని, సంక్షేమ పథకాలకు అర్హులు కానివారి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. దాదాపు 70 శాతం మంది కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారులు ఉన్నారని వివరించారు.

కేటీఆర్ కిమ్‌లా వ్యవహరించారు

సౌత్ కొరియాలో కిమ్ తరహాలో కేటీఆర్ పదేండ్లు అధికారం అనుభవించారని చెప్పారు. తెలంగాణను మేమే తెచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, ఆ పార్టీ పాలన చూసి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామని ప్రజలు బాధపడ్డారని పేర్కొన్నారు. రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టారని, హైదరాబాద్ నగరంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గొప్ప విజన్‌తో ముందుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.

Read Also: 6 పేజీల లేఖ.. గవర్నర్‌కు BRS ఫిర్యాదు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>