కలం, డెస్క్ : సుప్రీంకోర్టు అహ్మదాబాద్ లోని హన్సోల్ గ్రామంలో 4వేల చెట్లను నరికివేయడంపై దాఖలైన పిటిషన్ మీద కీలక తీర్పు (Supreme Court) ఇచ్చింది. అభివృద్ధిలో భాగంగా కొంత పర్యావరణ నష్టం తప్పదని తెలిపింది. అయితే గతంలో హెచ్ సీయూ విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు ఇక్కడ చర్చకు వస్తోంది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములపై పెద్ద వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కంచగచ్చిబౌలిలోని హెచ్ సీయూ భూముల్లో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పర్మిషన్ లేకుండా చెట్లు ఎలా నరికేస్తారని వ్యాఖ్యానించింది. కొట్టేసిన చెట్ల స్థానంలో కొత్తవి నాటాలంటూ ఆదేశించింది.
ఇప్పుడు అహ్మదాబాద్ లోని హన్సోల్ గ్రామంలో నదీ తీరాభివృద్ధి ప్రాజెక్ట్ రెండో దశ కోసం 4వేల చెట్ల తొలగింపుపై దాఖలైన పిటిషన్ను పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఆర్.మహాదేవన్, జస్టిస్ జోయ్ మాల్యబాగ్చీతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ కలిసి నడవాల్సిందే అని స్పష్టం చేసింది ధర్మాసనం. చెట్ల నరికివేతపై జోక్యం అవసరం లేదని.. నరికిన చెట్లు సహజంగానే పెరిగేరకానికి చెందినవే కాబట్టి తిరిగి పెరగడానికి ఎక్కువ కష్టం ఉండదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. అభివృద్ధి జరిగే సమయంలో కొంత పర్యావరణ నష్టం జరుగుతుందని.. కానీ మౌలిక సదుపాయాలు అంతకంటే ముఖ్యం అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. అయితే ఒకే విషయం మీద సుప్రీంకోర్టు రెండు కేసుల్లో రెండు రకాల తీర్పులు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.


