కలం, వెబ్ డెస్క్ : కూకట్పల్లిలో చైనా మాంజా వల్ల చిన్నారి మరణించడం (Manja Death) పై సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఎక్స్ వేదికగా స్పందించారు. గుండె తరుక్కుపోతోంది.. అభం శుభం తెలియని చిన్నారి చేసిన నేరమేంటి? అని ప్రశ్నించారు. నాన్న బైక్ ముందు సీట్లో కూర్చుని, ఇంటికి వెళ్తున్నామని సంబరపడే లోపే.. మృత్యువు ‘మాంజా’ రూపంలో ఆమె మెడకు చుట్టుకుంది. ఆ చిన్నారి గొంతు తెగిపోతుంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకు ఎవరు బాధ్యులు? అని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్రాంతి అంటే సంతోషాలు పంచుకోవడం అని, ఇలా శోకాన్ని మిగల్చడం కాదు అని అన్నారు. కొందరు తమ ఆనందం కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిందని విచారం వ్యక్తం చేశారు. చైనా మాంజా కేవలం దారం కాదని, గాలిలో వేలాడే పదనైన కత్తి అని గుర్తుంచుకోవాలని సజ్జనార్ హెచ్చరించారు. ప్లాస్టిక్, నైలాన్ మాంజాను వాడకూడదని, పిల్లల చేతికి మారణాయుధాలను ఇవ్వకండి అని సూచించారు. చైనా మాంజాను వినియోగించినా, అమ్మినా ఉపేక్షించేది లేదని CP Sajjanar హెచ్చరించారు.


