కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సింగరేణి బొగ్గు టెండర్ల ప్రకంపనలు చోటుచేసుకుంటున్న వేళ నలుగురు మంత్రులు (Telangana Ministers) సమావేశం కావడం అటు ప్రభుత్వవర్గాల్లో, ఇటు పార్టీలో చర్చకు దారితీసింది. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణలు ఎదుర్కొంటున్నసమయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ ప్రజా భవన్లో సమావేశం కావడం గమనార్హం. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు సింగరేణి వ్యవహారంలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ గవర్నర్‌ను మంగళవారం కలవనున్న నేపథ్యంలో మంత్రుల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో మంత్రుల మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది వెలుగులోకి రాకపోయినా కీలకమైన అంశాలనే డిస్కస్ చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపైన చర్చించారా?.. లేక అంతర్గత విషయాలు లీక్ కావడంపై చర్చించారా?.. అనేది బహిర్గతం కాలేదు.
మొన్న రామగుండంలో ఐదుగురు మంత్రులు :
పది రోజుల క్రితం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఐదుగురు మంత్రులు (Telangana Ministers) పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇప్పుడు నలుగురు మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా నలుగురూ ఒకే కారులో లోక్‌భవన్‌లో జరిగిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నుంచి తిరుగు ప్రయాణం కావడం విశేషం. ఈ నలుగురు మంత్రులూ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నవారే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా టూర్లో ఉండగా ఈ భేటీ జరగడం సరికొత్త సందేహాలకు తావిచ్చినట్లయింది. ఒకవైపు ప్రతిపక్షాల ఆరోపణలు, మరోవైపు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కామెంట్స్, ఇంకోవైపు కోల్ ఇండియా అధికారుల విచారణ.. వీటన్నింటి నేపథ్యంలో సింగరేణి అంశానికి సంబంధించి లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం.
Read Also: 30% సూసైడ్స్.. IIT కాన్పూర్ లో ఏం జరుగుతోంది?
Follow Us On: Pinterest


