కలం, వెబ్‌డెస్క్: దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లోని 45 ఆలయాల్లో హిందూయేతరులకు ప్రవేశం నిలిపివేయనున్నారు. ఇందులో చార్ధామ్ యాత్రలోని ప్రఖ్యాత బదరీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు (Badrinath – Kedarnath) కూడా ఉన్నాయి. ఈ మేరకు బదరీనాథ్–కేదార్నాథ్ దేవస్థాన కమిటీ(బీకేటీసీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది అమలులోకి వస్తే బీకేటీసీ పరిధిలోని బదరీనాథ్, కేదార్‌నాథ్‌తో సహా మరో 43 ఆలయాల్లో అన్యమతస్థులకు ప్రవేశం లేనట్లే. వీటిలో తుంగనాథ్, మాతామూర్తి, జోషీమఠ్ నరసింహ, శ్రీ మద్మహేశ్వర్, ఉఖీమఠ్ ఓంకారేశ్వర ఆలయం ఉన్నాయి.
ఆలయ కమిటీ ప్రతిపాదనను బీకేటీసీ చైర్మన్, సీనియర్ బీజేపీ నాయకుడు హేమంత్ ద్వివేది ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో జరగబోయే కమిటీ బోర్డు సమావేశంలో అధికారికంగా తీర్మానం ఆమోదిస్తామని తెలిపారు. ఈ ఆలయాల్లో (Badrinath – Kedarnath) అన్యమతస్థులకు ప్రవేశం సంప్రదాయబద్ధంగా నిషేధమేనన్నారు. అయితే, బీజేపీయేతర ప్రభుత్వాల హయాంలో ఈ పురాతన సంప్రదాయం ఉల్లంఘనకు గురైందని ఆయన ఆరోపించారు. ఈ క్షేత్రాల పవిత్రతను కాపాడేలా, శతాబ్దాల నాటి ఆచారాలను సక్రమంగా అమలయ్యేలా ఆలయ కమిటీ ప్రస్తుతం నిర్ణయించిందని వెల్లడించారు.
అయితే, బీకేటీసీ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని మండిపడింది. “ఇప్పటికే అన్యమతస్థులు ఈ ఆలయాల్లోకి ప్రవేశించడం లేదు. కాబట్టి, ప్రత్యేక నిషేధం అవసరం లేదు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించడానికే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పనులకు పాల్పడుతోంది” అని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ ధస్మానా ఆరోపించారు.
Read Also: రూ.400కోట్ల డబ్బున్న కంటైనర్ అపహరణ.. తిరుపతి లింక్!
Follow Us On: Sharechat


