కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా మధిర వాసి గడ్డమనుగు చంద్రమౌళి (Gaddamanugu Chandramouli) పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (Abdul Kalam) బృందంలో పనిచేశారు. ఆయనకు ఇటీవల పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆకాష్ క్షిపణి (Akash) తయారీ బృందంలో చంద్రమౌళి కూడా ఉన్నారు. పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాష్ క్షిపణి తయారు చేసే బాధ్యతను ప్రముఖ శాస్త్రవేత్త ప్రహ్లాద రామారావుకి అప్పగించినపుడు, ఆ బృందంలో చంద్రమౌళి కూడా పనిచేయడం గమనార్హం. ఆ తర్వాత ఆకాష్ క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ సంధించిన క్షిపణులను సమర్ధవంతంగా ఆకాష్ మిస్సైల్ తిప్పికొట్టడం అప్పట్లో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. మధిర పట్టణానికి చెందిన సత్యనారాయణ రావు, సరస్వతి దంపతులకు 1958 నవంబర్ 9న చంద్రమౌళి జన్మించారు. ఇంటర్ వరకు మధిరలోనే చదివిన చంద్రమౌళి (Gaddamanugu Chandramouli) వరంగల్ ఎన్ఐటీలో బీటెక్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డీ చేశారు. డీఆర్డీఓ, డీఆర్ డీఎల్ లో 34 ఏళ్లుగా పని చేసి ఎన్నో అవార్డులు అందుకున్నారు. చివరికి పద్మశ్రీ కూడా రావడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: 30% సూసైడ్స్.. IIT కాన్పూర్ లో ఏం జరుగుతోంది?
Follow Us On: Pinterest


