కలం, తెలంగాణ బ్యూరో: కిరణ్ బేడీ (Kiran Bedi).. ఆ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది దేశంలోని తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్! పోలీస్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక ఆమె.. ప్రజా ఉద్యమాలు, ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. 2015 లో బీజేపీలో చేరి.. ఆ తర్వాత పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఈ 1972 బ్యాచ్ తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్.. ప్రస్తుతం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.
1975 రిపబ్లిక్ డే పరేడ్ .. కిరణ్ బేడీ (Kiran Bedi) కెరీర్ లో కీలక ఘట్టం. ఢిల్లీ పోలీస్ బృందానికి నాడు ఆమె నాయకత్వం వహించి రికార్డు సృష్టించారు. అంతకు ముందువరకు రిపబ్లిక్ డే పరేడ్ లో పురుష ఆఫీసర్లు మాత్రమే నాయకత్వం వహించేవారు. రాజ్ పథ్ (ప్రస్తుత కర్తవ్య పథ్) లో కిరణ్ బేడీ పరేడ్ నిర్వహిస్తుంటే నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ (Indira Gandhi) సహా అక్కడి వారంతా లేచి చప్పట్లు కొట్టారు. 1975 జనవరి 26న పరేడ్ లో భాగంగా విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు 14 కిలో మీటర్ల మేర చేతిలో కత్తి పట్టుకొని టీమ్ తో కలిసి చేపట్టిన కవాతు మరిచిపోలేనిదని, నాటి ప్రధాని ఇందిరాగాంధీ తనను బ్రేక్ ఫాస్ట్ కు పిలిచి కలిసి అల్పాహారం తీసుకున్నారని కిరణ్ బేడీ గుర్తుచేసుకుంటూ నాటి ఫొటోలను సోమవారం ట్విట్టర్ (X)లో పోస్టు చేశారు.
Read Also: పరుగాపని పుత్తడి.. మళ్లీ పెరిగిన ధరలు
Follow Us On: Sharechat


