కలం, వెబ్ డెస్క్: అమెరికాలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల(Immigration Agents) కాల్పుల్లో మరో అమెరికన్ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్(Minneapolis )లో శనివారం జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. మృతుడు అమెరికా పౌరుడేనని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు నిరసనగా అక్కడితో పాటు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, సాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు నగరాల్లో భారీగా నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. వలసదారులపై తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఒక వ్యక్తి ఏజెంట్లపై దాడికి ప్రయత్నించాడని, తన వద్ద తుపాకీ ఉన్నట్టు అనుమానం రావడంతో ఆత్మరక్షణ కోసం బోర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్ కాల్పులు జరిపాడని హోం ల్యాండ్స్ సెక్యూరిటీ(Homeland Security) శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ వాదనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ ఘటనకు సంబంధించిన వీడియోల్లో మృతుడు అలెక్స్ ప్రెట్టీ (37) చేతిలో తుపాకీ కాకుండా మొబైల్ ఫోన్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఒక ఐసీయూ నర్సుగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్లు కొందరు మహిళలను తోసివేయడంతో ప్రెట్టీ మధ్యలో జోక్యం చేసుకున్నట్టు వీడియోల్లో ఉంది. ఈ సమయంలో ఆయనపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. అనంతరం పలువురు ఏజెంట్లు ఆయనను కిందకు నెట్టగా, ఒక అధికారి వెనుక నుంచి తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్చినట్టు తెలుస్తోంది. కాల్పుల తర్వాత ఏజెంట్లు కొద్దిసేపు వెనక్కి వెళ్లి, ఆ తర్వాత ప్రెట్టీకి వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినట్టు వీడియోల్లో కనిపిస్తోంది. అయితే అప్పటికే ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన అమెరికా(American) వ్యాప్తంగా వలసదారులపై ప్రభుత్వ తీరు, పోలీసుల దౌర్జన్యంపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. ఇటీవల జనవరి 7న కూడా కాల్పుల్లో ఒకరు మరణించారు.


