కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొన్ని రోజులుగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ఫోన్ ట్యాపింగ్’ వివాదం కొత్త మలుపు తీసుకున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది. బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు స్పందనగా కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఇలాంటి నోటీసులు తనకు కొత్త కాదని, గతంలో అర డజను కేటీఆర్ నుంచి వచ్చాయని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి నోటీసులకు భయపడేవాడిని కానని అన్నారు. ఇప్పటికే తాను తొమ్మిది నెలలు జైలులో ఉండి వచ్చానని, పార్టీ కోసం, దేశం కోసం, కార్యకర్తల కోసం మరోసారి జైలుకు వెళ్ళడానికి భయమేమీ లేదన్నారు.
ఇలాంటి నోటీసులకు భయపడను : బండి
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ ప్రయోజనం పొందిందని, వేలాది కోట్ల రూపాలను వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి బలవంతంగా వసూలు చేసిందని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్ లీగల్ నోటీసులు జారీచేశారు. “మీరు ఎన్ని నోటీసులు పంపినా నిజం చెరిగిపోదు… ఆ నోటీసులు నిజాన్ని దాచలేవు.. ఎంత భయపడుతున్నారో ఆ నోటీసులు చెప్తున్నాయి. తెలంగాణ గౌరవానికి కేసీఆర్ పాలన చేసిన గాయం ఇలాంటి లేఖలతో వెనక్కి పోతుందా?.. మానిపోతుందా?..” అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం నోటీసులతో తనను భయపెట్టలేరని, తన పార్టీ కోసం, కార్యకర్తల కోసం, దేశం కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
నిజం గెలుస్తుంది.. తప్పులకు శిక్ష పడాలి :
రాష్ట్ర ప్రజలంతా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే బలంగా నమ్ముతున్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి సైతం గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు చేశారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇంత వివాదం జరుగుతున్నా కేటీఆర్ ఇప్పటికీ “ఫోన్ ట్యాపింగ్ జరగలేదు..” అని సూటిగా ఎందుకు సమాధానం చెప్పడంలేదని నిలదీశారు. “ఫోన్‌లను ఎందుకు ట్యాపింగ్ చేశారం”టూ ప్రజలు అడుగుతూ ఉంటే “ట్యాపింగ్ చేయలేదు… అని కేటీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. కేవలం ‘నిజం’ మాత్రమే నిలబడుతుందన్నారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్‌లో బండి సంజయ్ పేర్కొనడంతో ఫోన్ ట్యాపింగ్ వివాదం రానున్న రోజుల్లో ఎన్ని రాజకీయ విమర్శలకు దారితీస్తుందో, ఎన్ని లీగల్ నోటీసులు జారీ అవుతాయో, ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Read Also: ఏదులాపురం పురపోరు.. కాంగ్రెస్‌లోకి వలసలు
Follow Us On: Sharechat


