కలం, వెబ్ డెస్క్ : రూపాయి విలువ (Rupee value) భారీగా పతనం అయిపోయింది. ఆల్ టైమ్ రికార్టు కొట్టేసింది. చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా డాలర్ తో పోలిస్తే 91.74 వద్ద ట్రేడ్ అవుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే రూపాయి విలువ పడిపోతే మన దేశంలో నిత్యవసర, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయా అనేది ఇక్కడ చాలా మంది ప్రశ్న. రూపాయి విలువ పడిపోతే అన్ని రకాల వస్తువుల ధరలు పెరగకపోవచ్చు. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మాత్రం గణనీయంగా పెరుగుతాయి. అదే సమయంలో కొందరికి లాభం కూడా జరుగుతుంది. అసలు రూపాయి విలువ ఇంత ఘోరంగా ఎందుకు పడిపోతోంది.. ధరలు పెరిగే వస్తువులు, లాభం జరిగే సంస్థల గురించి ఒకసారి లుక్కేద్దాం.
రూపాయి పతనానికి కారణాలు ఇవే..
రూపాయి పతనానికి విదేశీ పోర్ట్ ఫోలియో ప్రధాన కారణాల్లో ఒకటి. అంటే విదేశీ పెట్టుబడిదారులు మన దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇలా వాళ్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడల్లా ఆటోమేటిక్ గా డాలర్ కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది. జనవరి 19న ఒక్కరోజే రూ.3వేల కోట్లకు పైగా విలువైన మన దేశీయ ఈక్విటీ షేర్లను విదేశీయులు అమ్మేశారు. విదేశీయుల షేర్ల అమ్మకాలు ఇంకా కొనసాగుతుండటం వల్ల రూపాయి విలువ పడిపోతూనే ఉంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద భారీగా టారిఫ్ లు వేస్తుండటం ఇంకో రీజన్. ఈ టారిఫ్ ల వల్ల ఇండియా రూపాయి ట్రేడ్ విలువ పడిపోతోంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి పరిస్థితులు, దేశీయ దిగుమతి దారులు డాలర్లను భారీగా కొనడం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. ఇంకోవైపు అమెరికాతో ఇండియా వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం కూడా ఇక్కడ కారణమే.
ధరలు పెరిగే వస్తువులు ఇవే..
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి వాల్యూ తగ్గినప్పుడు ఏ వస్తువు దిగుమతి చేసుకోవాలన్నా ఎక్కువ ఇండియన్ కరెన్సీని చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మన దేశంలో ఆ వస్తువుల ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇలా చూసుకుంటే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు ప్రధానంగా పెరిగే అవకాశాలున్నాయి. మన దేశం 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అలాగే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలతో పాటు ఇతర టెక్నాలజీ పరమైన వస్తువుల విడి భాగాలను, వంట నూనెలు, పామాయిల్ తో పాటు ఇతర వంటలకు సంబంధించిన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ లెక్కన వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీటి ధరలు ఇంకా స్థిరంగానే ఉన్నాయి కాబట్టి కొనాలనుకునే వారు ఇప్పుడే కొనేస్తే బెటర్.
బంగారం ధరలపై ఎఫెక్ట్..
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో స్థిరంగా ఉన్నా.. మన రూపాయి విలువ పడిపోవడం వల్ల ఇండియాలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ రేటు పెరిగితే ఇండియాలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది.
విదేశాల్లో చదువుకుంటున్న స్టూడెంట్లకు ఇబ్బందే..
విదేశాల్లో చదువుకుంటున్న స్టూడెంట్లు కాలేజీలు, యూనివర్సిటీల ఫీజులు గతం కంటే ఇప్పుడు పెరుగుతాయి. రూపాయి విలువ ఎంత పడిపోతే మనం చెల్లించే ఇండియన్ కరెన్సీ అంత పెరుగుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న స్టూడెంట్లకు ఇండియా నుంచే డబ్బులు పంపితే.. ఇక నుంచి వాటి భారం కూడా పెరుగుతుంది.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం..
ధరలు పెరిగినంత స్థాయిలో ప్రజల ఆదాయం పెరగదు. కాబట్టి కొనుగోలు శక్తి ఆటోమేటిక్ గా తగ్గుతుంది. గతంలో రూ.100కు వచ్చిన వస్తువుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిందే. దీని వల్ల ఇండియాలో వస్తువుల తయారీరంగం మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని వల్ల నిరుద్యోగం పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. రూపాయి విలువ మరింత పడిపోకుండా ఇప్పటికే ఆర్బీఐ రంగంలోకి దిగింది. కానీ అనుకున్న స్థాయిలో రూపాయి విలువ ఉండట్లేదు. అమెరికా ఇండియా మీద టారిఫ్ లు తగ్గిస్తామని చెబుతోంది. ఒకవేళ అది జరిగితే ఇండియన్ రూపాయి కొంత బలపడే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఇండియాలో తయారయ్యే వస్తువల సంఖ్య పెంచాలి. ఇతర దేశాల వస్తువుల మీద ఆధారపడటం తగ్గించి.. ఉపాధి మార్గాలను పెంచితే రూపాయి అంతర్జాతీయ మార్కెట్ లో బలం పుంజుకుంటుంది.
వీరికి లాభం..
రూపాయి విలువ (Rupee Value) పెరిగిపోతే మన దేశంలోని కొందరికి లాభం జరుగుతుంది. మరీ ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా, టెక్స్ టైల్, ఇతర వస్తువులను తయారు చేసే కంపెనీలకు లాభం జరుగుతుతంది. ఈ కంపెనీలు వాటి వస్తువులు, సేవలను అమెరికాతో పాటు ఇతర దేశాలకు అమ్ముతాయి. వారందరికీ డాలర్లలో ఆదాయం వస్తుంది కాబట్టి ఇండియా కరెన్సీ ఎక్కువ వస్తుంది. ఈ లెక్కన వారికి గతంలో కంటే ఎక్కువ రూపాయలు మిగులుతాయి.
Read Also: క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నారా.. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గదు..!
Follow Us On: Instagram


