కలం, వెబ్ డెస్క్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎనిమిది మంది మావోయిస్టులు (Maoists surrender) పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ సభ్యులు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిశోర్ ఝా సమక్షంలో జనజీవన స్రవంతిలో చేరారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలు, పోలీసుల సహాయ సహకారాల పట్ల ఆకర్షితులై, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.
లొంగిపోయిన (Maoists surrender) వారిలో జగిత్యాల జిల్లాకు చెందిన ధర్మాజీ శ్రీకాంత్ తో పాటు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పొడియం కాములు, ముడియం జోగ, కుంజం లక్కె, మోదం భీమ, కుంజం ఉంగా, ముడికం సుక్రం మరియు ముడియం మంగు ఉన్నారు. వీరంతా గతంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. వీరిలో ధర్మాజీ శ్రీకాంత్ కొరియర్‌గా పనిచేస్తుండగా, పొడియం కాములు మిలీషియా కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కుంజం లక్కె గతంలో జరిగిన ఆంధ్రి ఎన్‌కౌంటర్ నుండి తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, అజ్ఞాతంలో ఉన్న అదిలాబాద్, కరీంనగర్ జిల్లా మావోయిస్టులు అందరూ తమ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున అందవలసిన పునరావాస ఫలితాలను, జీవనోపాధిని కల్పించేందుకు రామగుండం కమిషనరేట్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్, ఇన్ స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ఐ శేఖర్, ఆర్ఎస్ఐ లు వెంకట్, శివ పాల్గొన్నారు.
Read Also: ఎస్‌బీఐ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్
Follow Us On : WhatsApp


