కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికింకా రాజకీయ పార్టీగా అవతరించకపోవడంతో మరో పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేయాలనుకుంటున్నది. నిజామాబాద్, మంచిర్యాల సహా సింగరేణి ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జాగృతి కార్యకర్తలు పోటీ చేయనున్నారు. ఇందుకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఆ పార్టీకి ఉన్న కామన్ సింబల్ సింహం గుర్తుతో మున్సిపల్ బరిలోకి దిగనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అప్పుడే వీరి మధ్య సింహం గుర్తు మీద పోటీ చేయాలనే నిర్ణయం జరిగింది.
కార్యకర్తలకు సంకేతమిచ్చిన కవిత :
ప్రస్తుతానికి ఒక రాజకీయ వేదిక లేకపోవడం, ఎన్నికల్లో పోటీకి కామన్ సింబల్ లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడంలోని సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్న నేపథ్యంలో జాగృతి కార్యకర్తల, అభిమానుల, ఎన్నికల్ల పోటీ చేయాలనే ఆశావహుల అభిప్రాయాలకు అనుగుణంగా కవిత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుమీద పోటీ చేయాలనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆమె ఎంచుకున్నారు. పోటీ చేయాలనుకున్న ఆశావహుల కోరిక, వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, కవిత ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున పోటీ చేసే అభ్యర్థులంతా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయనున్నారు.
Read Also: సింగరేణిపై కట్టుకథల విషపు రాతలు : భట్టి విక్రమార్క
Follow Us On: Pinterest


