కలం, వెబ్ డెస్క్ : సింగరేణిపై కొన్ని మీడియా సంస్థలు కట్టుకథల విషపు రాతలు రాస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. సింగరేణి (Singareni) పై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థయిర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వివరణ ఇస్తున్నానన్నారు. తమపై కట్టుకథల విషపు రాతలు ప్రచారం కొన్ని రోజులుగా వస్తూ ఉన్నాయన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ కథనాలన్నీ అసత్య ప్రచారమేనని, అవి అపోహలు సృష్టించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాలను అందిపుచ్చుకుంటూ కొనసాగింపుగా ఇతర మీడియాలోనూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. డిప్యూటీ సీఎంగా, విద్యుత్ మంత్రిగా సింగరేణికి నష్టం జరగొద్దని, ఆస్తుల్ని కాపాడాలని బాధ్యతగా వ్యవహరించానని భట్టి క్లారిటీ ఇచ్చారు.
ఏ రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో..
‘ఎవరి ప్రయోజనాలు దీని వెనక దాగి ఉన్నదో తెలియాలి. ఏ గద్దలు, రాబందుల కోసం ఈ కథనాన్ని రాశారో తేలాలి. అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థపైన నిందలు మోపడం ద్వారా సంస్థకు, రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని వారు మర్చిపోతున్నారు. కొద్దిమంది వ్యక్తులకు దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్‌ను పెట్టి, దాని ద్వారా నైని కోల్ బ్లాక్ మైనింగ్ వ్యవహారాన్ని ధారాదత్తం చేసి ప్రయోజనం చేకూర్చాలని రాశారు. సింగరేణిని ఆ వ్యక్తులకు దోచిపెట్టాలన్న ఉద్దేశాన్ని ఆపాదించారు. దీనికి కొనసాగింపుగా హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. వెంటనే కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారుల విజిట్ మొదలైంది.
సైట్ విజిట్ కండిషన్ ఫస్ట్ టైమ్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆయనకు అనుకూల వ్యక్తుల ప్రయోజనాల కోసమేనని రాయడాన్ని నేను వెంటనే ఖండించాను. ఇలాంటి టెండర్ల ఫైల్ ఏ ఒక్కరి నిర్ణయంతో సంబంధిత మంత్రి దగ్గరకు రాదు. సింగరేణి స్వతంత్రంగా పనిచేసే 105 ఏండ్ల చరిత్ర కలిగిన సంస్థ. అటానమస్ స్వభావంతో పనిచేస్తున్నది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నాం. విషయ పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఇలాంటి రాతలు రాయరు. ఇంతటి స్థాయిలో ఆరోపణలు వచ్చాయి కాబట్టే టెండర్లను రద్దు చేయాలని ఆదేశించాను. వారం రోజుల్లో తప్పును సరిదిద్దుదునే ధోరణి కనిపించలేదు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి తెలిసేలా కిషన్ రెడ్డి అధికారులను ఇక్కడికి పంపడం మంచిదేనని.. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను ’ అని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.
సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ లిమిటెడ్ (సీఎంపీడీఎల్) అనేది కోల్ ఇండియా కింద పనిచేసే కేంద్ర ప్రభుత్వ ‘మినీ రత్న’ సంస్థ అని భట్టి చెప్పారు. 2018లో టెండర్ కోసం డాక్యుమెంట్ తయారు చేయాలని సింగరేణిని ఆ సంస్థ కోరిందని, చివరకు కోల్ ఇండియా టెండర్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిందని తెలిపారు. అందులోనే సైట్ విజిట్ తప్పనిసరి అని, సర్టిఫికెట్ ను జతపర్చాలని స్పష్టం చేసిందన్నారు. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇవ్వాలని 2021లో సూచించిందని ఆయన గుర్తు చేశారు. అప్పుడు రాష్ట్రంలో గానీ, కేంద్రంలోగానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదని గుర్త చేశారు.
పారదర్శకంగా టెండర్ ప్రక్రియ జరగాలనే మంచి ఉద్దేశంతోనే టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. సీఎంపీడీఎల్ 2023లో సైట్ విజిట్ తప్పనిసరిగా ఉండాలని భువనేశ్వర్ ఆఫీసు నుంచి షరతును నొక్కిచెప్పిందని, భూ పరిస్థితి, రోడ్ల పరిస్థితి.. ఇలాంటివన్నింటినీ స్టడీ చేసి టెండర్ డాక్యుమెంట్‌తో జతపర్చాలని సూచించిందన్నారు. ఈ షరతు తాను పెట్టింది కాదని స్పష్టం చేశారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) 15.5.2021న సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కాన్ కాపీని సమర్పించాలని, టెండర్ దాఖలు చేసే ముందు ఈ సర్టిఫికెట్ ఉండాల్సిందేనని చెప్పిందన్నారు. మెకాన్ సంస్థ కూడా దీన్నే స్పష్టం చేసిందని భట్టి గుర్తుచేశారు. స్థానిక కండిషన్లను సైట్ విజిట్ చేయడం ద్వారా అవగాహన చేసుకుని టెండర్ డాక్యుమెంట్ సమర్పించే సందర్భంగా సర్టిఫికెట్ జతపర్చాలని సూచించిందన్నారు. ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు సైట్ విజిట్ గురించి నొక్కి చెప్పాయని డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka) వెల్లడించారు.
Read Also: టీ హబ్‌లో ప్రభుత్వ ఆఫీసులు.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
Follow Us On: Sharechat


