కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంలో ఇప్పటివరకు రిటైర్డ్ పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు, వెల్లడించిన వివరాలు ఎలా ఉన్నా కవిత (Kavitha) ఇటీవల చేసిన కామెంట్లు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఆమె లేవనెత్తిన అంశాలను సిట్ (SIT) పోలీసులు కేటీఆర్‌ను విచారించే సమయంలో ప్రస్తావించే అవకాశమున్నది. “ఇంటల్లుడి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు… సిగ్గుండాలి… కేటీఆర్ భార్య ఫోన్‌ను ఇదే తీరులో ట్యాపింగ్ చేస్తే ఆయన ఊరుకునేవాడా?..” అని కవిత ఇటీవల కామెంట్ చేశారు. బహిరంగంగానే ఆమె ఈ కామెంట్లు చేయడంతో పోలీసులు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తున్నది. ఆమె భుజం మీద తుపాకీ పెట్టి కేటీఆర్, హరీశ్‌రావు, కేసీఆర్‌లను పోలీసులు టార్గెట్ చేస్తారన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ‘పెద్దాయన’ అంటూ ప్రభాకర్‌రావు చెప్పనే చెప్పారు.
కవిత (Kavitha) దగ్గరున్న ఆధారాలేంటి? :
ఒక సాక్షిగా లేదా ఒక బాధితురాలిగా కవితను కూడా పోలీసులు విచారించే అవకాశమున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ కొద్దిమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితులుగా పరిగణించిన పోలీసులు వారి నుంచి వివరాలను సేకరించారు. స్టేట్మెంట్లు రికార్డు చేశారు. పోలీసుల దగ్గరున్న వివరాలతో పోల్చి చూసి వారి ఫోన్లు ట్యాపింగ్ అయ్యి ఉంటే కొన్ని ఆధారాలను రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కవిత విషయంలోనూ విచారణకు పిలిచి అదే తరహాలో వివరాలను తీసుకునే అవకాశమున్నది. ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో కూడా ఆరా తీసే అవకాశమున్నది. బాధితుడిగా కవిత భర్తను కూడా ఎంక్వయిరీకి పిలిచి కాల్ డేటా మొదలు ఇతర టెక్నికల్ ఎవిడెన్సులను పోలీసులు సేకరించే అవకాశమున్నది.
బీఆర్ఎస్ను వేధిస్తున్న అంశమిదే :
కవిత చేసిన కామెంట్లను ఇప్పటివరకూ బీఆర్ఎస్ నేతలు లైట్‌గా తీసుకున్నా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా కేటీఆర్, హరీశ్‌రావును విచారణకు పిలవడంతో రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కవిత కామెంట్లను ఇప్పటిదాకా సీరియస్‌గా పట్టించుకోకున్నా భవిష్యత్తులో ఆమెను ఎంక్వయిరీకి పిలిస్తే ఆమె ఎలాంటి ఎవిడెన్సులను చూపుతుందనే గుబులు గులాబీ నేతలకు పట్టుకున్నది. స్పష్టమైన ఎవిడెన్సులు ఉన్నట్లయితే తప్పించుకోడానికి ఆస్కారం ఉండకపోవచ్చనే భయమూ వెంటాడుతున్నది. ఆమె దగ్గర ఎవిడెన్సులు ఉండే అవకాశమున్నదా?.. పోలీసుల దగ్గర ఉన్న వివరాలేవైనా రూఢీపరుస్తాయా?.. స్టేట్మెంట్లలో ఎలా చెప్పినా ఆ ఎవిడెన్సులేమైనా పట్టిస్తాయా?.. ఇలాంటి ఆందోళన గులాబీ లీడర్లలో నెలకొన్నది. హరీశ్‌రావు విచారణకు వెళ్ళేంతవరకూ ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందని ప్రజల్లో ఓపెన్ టాక్ ఎలా ఉన్నా తగిన ఆధారాలను పోలీసులు ఆయన ముందే ఉంచడం గమనార్హం. ఇప్పుడు కవిత భర్త ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ ఇలాంటిదే రిపీట్ అవుతుందేమోననే ఆందోళన నేతలను వెంటాడుతున్నది.
Read Also: కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On: X(Twitter)


