కలం, మెదక్ బ్యూరో : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అధికారులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకి వరుసగా సమన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
సిట్ నోటీసులు అందుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇప్పటికే విచారణకి హాజరై వివరాలు వెల్లడించారు. మున్ముందు ఈ కేసు ఎలాంటి మలుపు తిరగనుంది అనే ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలోనే.. మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కి సమన్లు జారీ అవడం చర్చనీయాంశం అయింది. కేటీఆర్ కి నోటీసులు అందిన గంటల వ్యవధిలోనే హరీశ్ రావు ఫామ్ హౌజ్‌కు వెళ్ళి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్ సాయంత్రం తర్వాత చేరుకున్నారు. అనంతరం ఈ ముగ్గురూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.
‘పెద్దాయన’ సెంట్రిక్ గా దిశా నిర్దేశం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న KTR.. రేపు విచారణకి హాజరవుతానని క్లారిటీ ఇచ్చారు. ఎంక్వయిరీకి వెళ్ళడానికి ముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. భేటీలో బీఆర్ఎస్ అగ్రనేతలు చర్చించే అంశాలపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేతలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ముగ్గురు నేతలు కీలక చర్చలకు ప్రాధాన్యత నెలకొన్నది. ఎంక్వయిరీలో పోలీసులు కేటీఆర్‌కు సంధించే ప్రశ్నలను అంచనా వేసుకుని వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై ముగ్గురూ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇటీవల హరీశ్‌రావును విచారించిన సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి ఆయన ఇచ్చిన సమాధానాలు, పోలీసులు కొన్ని ఆధారాలను హరీశ్‌రావు ముందు ఉంచిన అంశాలను ఆధారంగా చేసుకుని కేటీఆర్‌కు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ‘పెద్దాయన’ అని ప్రస్తావించిన నేపథ్యంలో, ఈ అంశంపై పోలీసులు కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో KCRను సూచిస్తూ ‘పెద్దాయన’ అని పేర్కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేటీఆర్ ఎలా స్పందించాలి? ‘పెద్దాయన’ అనేది సాధారణ పదం మాత్రమేనని, అది తమకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.
చిక్కుకోకుండా తప్పించుకోవాలి!
అధికారులు అడిగే ప్రశ్నలకు ఏదైనా అనవసరమైన రిప్లై ఇస్తే, అది మరిన్ని చిక్కులకు దారితీస్తుందని, అందుకే జాగ్రత్తగా మాట్లాడాలని కేటీఆర్ ని కేసీఆర్ హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే హరీశ్ రావును సిట్ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఆయనని ప్రశ్నించిన తరహాలోనే కేటీఆర్‌కు కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అదే విధంగా సమాధానాలు సిద్ధం చేయాలని కేసీఆర్ గైడెన్స్ ఇచ్చారు.
ముఖ్యంగా, ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియలో తమ పాత్ర లేదని, ఇది ప్రభుత్వ వ్యవహారాల్లో భాగమని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని వాదించాలని సూచించినట్టు తెలుస్తోంది. సమాధానాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి చిక్కులు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఉదాహరణకు, ఏదైనా అస్పష్టమైన రిప్లై ఇస్తే అది మరిన్ని ప్రశ్నలకు దారితీస్తుంది, ఒక్కోసారి అవే ఆధారాలుగా మారవచ్చు. అందుకే, ‘తెలియదు’, ‘సంబంధం లేదు’ వంటి సమాధానాలతో ముందుకు వెళ్లాలని, అనవసరమైన వివరాలు చెప్పకుండా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారట.
రాజకీయ వ్యూహాలు…
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. కవిత ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. వీటితో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Case) గులాబీ పార్టీని ప్రజల్లో మరింత పలుచన చేసే అవకాశం ఉంది. దీనిని ప్రజాక్షేత్రంలో ఎలా తిప్పికొట్టాలి? లీగల్ గా ఎలా ఫైట్ చేయాలి అనే అంశాలపైనా ముగ్గురు నేతలు డిస్కస్ చేశారు. ఇది రాజకీయ కుట్ర అని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమని బయటికి చెప్పాలని నిర్ణయించారు.
బొగ్గు కుంభకోణం, గ్యారంటీలు అమలు కాకపోవడం, ఇతర ప్రభుత్వ వైఫల్యాలపై రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కుట్రపూరితంగా నోటీసులు ఇస్తూ… కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. హరీశ్ రావు సిట్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై హల్‌చల్ చేశారు. అదే విధంగా కేటీఆర్ విచారణ సమయంలో కూడా భారీ జనసమీకరణతో ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముగ్గురు నేతలు వ్యూహం రచించినట్టు తెలుస్తోంది.


