కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను (TGMREIS) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరితో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు.
మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా మైనారిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. గత విద్యా ఫలితాలను పరిశీలిస్తే పదో తరగతిలో 97 శాతం, ఇంటర్మీడియట్లో 88 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. కేవలం సాధారణ విద్యే కాకుండా ఐఐటీ, ఎంబీబీఎస్, సీఏ, లాసెట్ వంటి పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు అత్యుత్తమ సీట్లు సాధించడం సంస్థ పనితీరుకు నిదర్శనమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో విస్తరించి ఉన్న 205 పాఠశాలలు, జూనియర్ కళాశాలల ద్వారా ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాలలో విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, వసతి, పౌష్టికాహారం, ఆరోగ్య సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. బాలురు, బాలికలకు వేర్వేరు క్యాంపస్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్సైట్ tgmreistelangana.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Read Also: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాటలతో ఇబ్బంది పడ్డా: ట్రంప్
Follow Us On: X(Twitter)


