కలం, వెబ్డెస్క్: దక్షిణాదిలో ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు అసెంబ్లీల్లో ఆ రాష్ట్ర గవర్నర్ల తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తీరు కర్ణాటక విధానసభలోనూ చోటుచేసుకుంది. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ (Thawar Chand Gehlot) చదవలేదు. అంతేకాదు, ‘ ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది. సమావేశాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నా’ అంటూ రెండే వాక్యాలు మాట్లాడి సభ నుంచి వెళ్లిపోయారు.
దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సైతం గవర్నర్ తీరును ఆక్షేపించింది. కాగా, మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పేరును వీబీ జీ రామ్ జీగా మార్చడం, చట్టంలో సవరణలు చేయడం వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రసంగంలో పొందుపర్చింది. దీనిని చదవాల్సి వస్తుందనే గవర్నర్ ఇలా చేశారని కాంగ్రెస్ మండిపడింది. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.
మరోవైపు ఇదే తరహాలో కేరళలోనూ ఆ రాష్ట్ర గవర్నర్ వ్యవహరించిన తీరు తెలిసిందే. అక్కడ కూడా వీబీ జీ రామ్ జీ చట్టం పేరుతో చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ ఉన్న అంశాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చదవలేదు. ఇక, తమిళనాడులో అసెంబ్లీలో జాతీయ గీతం పాడలేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి అర్ధాంతరంగా సభ నుంచి వెళ్లిపోవడం కలకలం రేపింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు అధికారంలో ఉండడంతో.. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగా గవర్నర్ల ద్వారా ఇలాంటి పనులు చేయిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.

Read Also: గ్రాషా మేషల్కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
Follow Us On: Youtube


