కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సంప్రదాయ బోధనతో పాటు అత్యాధునిక డిజిటల్ విద్యా విధానాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ (Aarogyasri Trust) కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
వైద్య విద్యలో సాంకేతికతను జోడించడం ద్వారా ప్రాంతీయ వివక్ష లేకుండా విద్యార్థులందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించవచ్చని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రుల్లో లభించే బోధనా స్థాయిని కొత్తగా ఏర్పాటైన జిల్లాల మెడికల్ కాలేజీల్లోనూ అమలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఉస్మానియా విద్యార్థికైనా, మారుమూల ఆసిఫాబాద్ విద్యార్థికైనా ఒకే రకమైన నాణ్యమైన విద్య అందాలని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ విధానంలో భాగంగా ప్రతి కాలేజీలో స్మార్ట్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం కాకుండా, మెడికోలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేలా వర్చువల్ ల్యాబ్స్, సిమ్యులేషన్ టూల్స్ ఏర్పాటు చేయనున్నారు. క్లిష్టమైన అనాటమీ, సర్జికల్ ప్రక్రియలను స్పష్టంగా అర్థం చేసుకునేందుకు వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతను వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు.

Read Also: గ్రాషా మేషల్కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
Follow Us On : WhatsApp


