కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని, పనుల్లో జాప్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని హెచ్చరించారు.
పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్ బిసి టన్నెల్ పనులపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన ప్రమాదం వల్ల టన్నెల్‌లో చిక్కుకుపోయిన బోర్ హింగ్ మెషీన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం రైలు ట్రాక్ సహాయంతో మరమ్మతులు సాగుతున్నాయని ఆయన వివరించారు.
మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నివేదిక సమర్పించిందని మంత్రి తెలిపారు. మెడిగడ్డ వద్ద ఇప్పటికే నిపుణుల బృందం క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభించగా, అన్నారం మరియు సుందిళ్ల వద్ద ఈ నెల 22 నుంచి పరిశీలన మొదలవుతుందని చెప్పారు. నెల రోజుల్లోగా ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరదల కారణంగా భారీగా ఇసుక, మట్టి చేరిందని, దీనివల్ల 112 టీఎంసీల సామర్థ్యం కాస్తా 90 టీఎంసీలకు పడిపోయిందని గుర్తు చేశారు. పంజాబ్ తరహాలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా పూడికతీత పనులకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.

తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి సంబంధించి ఇప్పటికే 73 చదరపు కిలోమీటర్ల మేర టోపోగ్రాఫికల్ సర్వే, 85 కిలోమీటర్ల మేర కాలువ సర్వే పూర్తయిందని మంత్రి తెలిపారు. వెంటనే డీపీఆర్ లకు తుదిరూపం ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్టుల పనులకు అవసరమైన నిధుల కేటాయింపునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని, అధికారులు నిబంధనలు పాటిస్తూనే అత్యున్నత నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Read Also: నేను బ్యాటింగ్ బాగానే చేస్తున్నాను: సూర్యకుమార్
Follow Us On : WhatsApp


