కలం, ఖమ్మం బ్యూరో : మార్క్స్, ఎంగిల్స్ కలలు కన్న సమసమాజ స్వప్నాన్ని నిజం చేసిన మహోన్నతుడు విఐ లెనిన్ (Vladimir Lenin) అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా (Raja) తెలిపారు. రష్యా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలోనూ లెనిన్ నిర్వహించిన పాత్ర అమోఘమని ఆయన తెలిపారు. విఐ లెనిన్ 103వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గం బుధవారం ఘనంగా నివాళులర్పించింది. లెనిన్ చిత్ర పటానికి డి. రాజా, అమర్జిత్ కౌర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ మార్క్సిస్టు (Marxist) సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన లెనిన్ సామ్రాజ్యవాదం గురించి గొప్పగా విశ్లేషించారని అన్నారు. పెట్టుబడిదారి సమాజం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదాన్ని లెనిన్ ఉద్బోదించారని రాజా తెలిపారు. లెనిన్ రష్యాలో సైద్దాంతిక రాజకీయ విషయాలపై దృష్టి సారించారు. సోషలిస్ట్ సమాజ స్థాపన ద్వారా ఈ ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన, అసమానతలు లేని సమాజాన్ని చూపించారు. పెట్టుబడిదారి సమాజం ప్రస్తుతం ఒక సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటుందని ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు శక్తులు పురోగమిస్తున్నాయని అన్నారు. పలు దేశాలలో ప్రజాస్వామిక పద్దతుల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం మార్క్సిజమేనని ఆయన స్పష్టం చేశారు. మార్క్సిజానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని రాజా (Raja) తేల్చి చెప్పారు. ట్రంప్ ప్రపంచ నియంతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని రాజా తెలిపారు. అంతర్జాతీయ గుత్తాధిపత్యం కోసం ట్రంప్ ప్రత్నిస్తున్నారు. లెనిన్ ఆశయ సాధనకు కృషి చేయడం ఆయన ఆశించిన సమసమాజ నిర్మాణానికి పాటుపడటమే మనం ఆయనకు ఇచ్చే సరైన నివాళి అని అన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జాతీయ కార్యదర్శులు అమర్త్ కౌర్, రామకృష్ణ పాండా, గీరిష్ శర్మ, కె. ప్రకాష్బాబు, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఫలించిన సీఎం రిక్వెస్ట్ : IAS క్యాడర్‌లో బలంగా తెలంగాణ ఇమేజ్
Follow Us On: X(Twitter)


