కలం, నిజామాబాద్ బ్యూరో: కర్ణాటక (Karnataka), తెలంగాణ (Telangana) సరిహద్దుల్లో ఓ చిరుత పులి (Leopard) మృత్యువాత పడింది. కామారెడ్డి (Kamareddy) జిల్లా జుక్కల్ మండలం బంగారు పల్లి – దోస్త్ పల్లి గ్రామ శివారులో చిరుత పులి మృతి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వ్యవసాయ పొలాల వైపు వెళ్లిన పశువుల కాపరులు, చనిపోయి ఉన్న పులిని చూసి గ్రామస్థులకు చెప్పడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు. స్థానిక అటవీశాఖ అధికారులు జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతి చెందిన చిరుత పులి సుమారు 18 ఏళ్ల వయస్సు ఉన్నట్లు పశు వైద్యులు గుర్తించారు. ఈ చిరుత పులి పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రాంతం నుండి వచ్చి చనిపోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కానప్పటికీ చనిపోయిన చిరుత తెల్లగా ఉండడంతో కర్ణాటక ప్రాంతం నుండి వచ్చి చనిపోయినట్లు పశు వైద్య అధికారులు తెలిపారు. పులి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరుత పులి సహజంగా మరణించిందా లేక వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మృతి చెందిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు బయట పడతాయి..


