కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా రామవరం మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (EMRS) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ (Jitesh V Patil) మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సాధారణ కార్యకలాపాలు, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో గిరిజన విద్యార్థుల విద్యా అవసరాలు, పాఠ్యపుస్తకాల లభ్యత, బోధనా విధానాలు, అకడమిక్ సపోర్ట్ వ్యవస్థ వంటి వివరాలు ఆరా తీశారు. విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు, విద్యా వనరులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పాఠశాలలోని క్రీడా మైదానం అభివృద్ధి, క్రీడా పరికరాల లభ్యత, విద్యార్థుల శారీరక ఆరోగ్యం, క్రీడల ద్వారా క్రమశిక్షణ పెంపొందించే అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. అనంతరం పాఠశాల మెస్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలపై వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తగిన పోషకాహారం తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, అంతర్గత రహదారులు గుంతలమయంగా ఉన్న విషయాన్ని గమనించి, వాటి అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Read Also: బీఆర్ఎస్తో వైసీపీ.. కాంగ్రెస్‌తో టీడీపీ.. ఖమ్మంలో పొత్తులుంటాయా..?
Follow Us On: Pinterest


