ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో గత వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి విడదల రజనీ(Vidadala Rajini) అనుచరులకు సంబంధించిన ఓ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. ఆమె అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 5 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. పల్నాడు(Palnadu) జిల్లాలో విడదల రజని పీఏలు, ఆమె అనుచరులపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దోర్నాలకు బీ ఫార్మసీ విద్యార్థి కృష్ణ, అతని స్నేహితులతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini) వ్యక్తిగత సహాయకులు శ్రీకాంత్‌రెడ్డి, దొడ్డా రామకృష్ణ, అలాగే ఆమె సన్నిహిత అనుచరులు శ్రీగణేశ్, అతని సోదరుడు కుమారస్వామి తమకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారని తెలిపారు. ఆ నమ్మకంతో తాము కలసి మొత్తం రూ.5 కోట్లు నగదు రూపంలో అందజేశామని బాధితులు చెప్పారు.
తరువాత అనుకున్న విధంగా ఉద్యోగాలు రాకపోవడంతో, తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు వారంతా బెదిరింపులకు దిగారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసు అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మాజీ మంత్రికి సన్నిహితులపై ఇంత భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి. మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అన్నది వేచి చూడాలి.
Read Also: కలెక్టర్లు, అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Follow Us On : Instagram

