కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం తమ కుంభకోణాలు బయటపడిన ప్రతిసారీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించిన కుంభకోణాన్ని తాము బయటపెట్టగానే, కావాలనే హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న విచారణలు సిట్ విచారణలు కావని, అవి కేవలం చిట్టినాయుడు విచారణలని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పనికిమాలిన కథలతో రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తున్నారని, లీకుల మీద ఎన్ని రోజులు బ్రతుకుతారని ప్రశ్నించారు.
సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి కుటుంబం ఒక బంగారు బాతులా వాడుకుంటోందని కేటీఆర్ అన్నారు. సృజన్ రెడ్డి కోసమే తొమ్మిది సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేశారని, బొగ్గు కుంభకోణానికి రేవంత్ బావమరిదే సూత్రధారి అని ఆయన ఆరోపించారు. సింగరేణిని కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రలపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రేవంత్ రెడ్డికి సిగ్గు రావడం లేదని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ప్రెస్‌మీట్ కూడా ఎందుకు పెట్టలేదని ఆయన అడిగారు. ఎన్ని విచారణలు చేసినా, తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.


