కలం, వెబ్ డెస్క్ : సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఇటీవల నెలకొన్న వివాదం వేళ హైకోర్టు (Telangana High Court) శుభవార్త చెప్పింది. టికెట్ ధరల పెంపు (Cinema Ticket Price Hikes)పై రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని అందులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సినిమాలకు టికెట్ ధరల పెంచుకోవడానికి అనుమతించిన విషయం తెలిసిందే. రాజాసాబ్ సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్ అయింది. ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అనిల్ రావిపూడి– చిరంజీవి కాంబోలో వచ్చిన మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపుపై న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హోం శాఖ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ధరల పెంపుపై ప్రభుత్వ న్యాయవాది తమ దృష్టికి తీసుకురాలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజులకు ముందే ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా చూడాలి. 90 రోజుల ముందు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటే చివరి నిమిషం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.


