కలం, వెబ్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక గొప్ప సంస్కారమని, ఒక కుటుంబమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బీజేపీలో సభ్యత్వాల కంటే సంబంధాలకే ఎక్కువ విలువ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన మోదీ, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
బీజేపీలో పదవులు కేవలం ఒక వ్యవస్థ మాత్రమేనని, కార్యభారం అనేది జీవితకాల బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. పార్టీలో అధ్యక్షులు మారవచ్చు కానీ ఆదర్శాలు మారవని, నాయకత్వం మారినా వెళ్లే దిశ మారదని ఆయన వెల్లడించారు. అధికారాన్ని తాము సుఖం కోసం కాకుండా సేవ కోసం ఒక మాధ్యమంగా మలచుకున్నామని, అందుకే ప్రజలకు పార్టీపై విశ్వాసం పెరుగుతోందని చెప్పారు.
గత 11 ఏళ్లలో హర్యానా, అస్సాం, త్రిపుర, ఒడిశాల్లో తొలిసారిగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అద్భుత ప్రయాణం సాగించామని ప్రధాని గుర్తుచేశారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రజల గొంతుకగా మారిందని ప్రశంసించారు. ఇటీవల జరిగిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిని ఎన్డీయే గెలుచుకోవడం ప్రజల నమ్మకానికి నిదర్శనమని తెలిపారు.
పార్లమెంటు, అసెంబ్లీలకే కాకుండా నగరపాలక సంస్థల్లోనూ బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని మోదీ అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 నగరాల్లో ఎన్డీయే విజయం సాధించడం, కేరళలోని తిరువనంతపురంలో 45 ఏళ్ల తర్వాత లెఫ్ట్ కోటను బద్దలు కొట్టి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం చారిత్రాత్మకమని నరేంద్ర మోదీ (Narendra Modi) కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశం కాంగ్రెస్ వారసత్వ మోడల్, లెఫ్ట్ మోడల్ వంటివి చూసిందని.. ఇప్పుడు స్థిరత్వం, సుపరిపాలనతో కూడిన బీజేపీ వికాస నమూనాను దేశం ఆదరిస్తోందని పేర్కొన్నారు.


