కలం, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్, కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ (Rinku Singh) వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ దేవతలను అవమానించాడంటూ అతనిపై కేసు నమోదు అయ్యింది. రింకూ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో దీనికి కారణమైంది. ఈ వీడియోలో.. రింకూ గ్రౌండ్లో సిక్స్ కొట్టగా, ఓ వాహనంలో హిందూ దేవతలు గ్లాసెస్ పెట్టుకొని, ఇంగ్లీష్ పాటలు వింటూ ప్రయాణిస్తున్నట్లు ఉంది. ఇది వైరల్ కావడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఉన్న సాస్ని గేట్ పోలీస్ స్టేషన్లో రింకూపై కర్నిసేన ఫిర్యాదు చేసింది. హిందూ దేవతలను అవమానించేలా వీడియో పోస్ట్ చేశాడంటూ కేసు పెట్టింది.
‘హిందూ దేవతలు అద్దాలు పెట్టుకొని, ఇంగ్లీష్ పాటలు వింటూ, డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియో చేయడం సహించలేనిది. ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం అతని జిహాదీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. సనాతన ధర్మాన్ని కించపరిచినందుకు రింకూ బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని కర్నిసేన జిల్లా అధ్యక్షుడు సుమిత్ తోమర్ డిమాండ్ చేశారు. కాగా, వీడియో ఎవరు తయారుచేశారు? ఎక్కడ నుంచి పోస్ట్ అయ్యిందని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజానికి రింకూ సింగ్ (Rinku Singh) సదుద్దేశంతోనే ఈ వీడియో పెట్టినట్లు తెలుస్తోంది. వీడియో ప్లే అవుతుండగా ‘నీ విజయానికి కారణం ఎవరు? ’ అనే ప్రశ్న, దాని వెంటనే ‘గాడ్ బ్రాట్ యు సక్సెస్’(దైవం నీ సక్సెస్‌కు కారణం) అనే వాక్యాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. అయితే, దేవతలకు గ్లాసెస్ పెట్టడం, ఇంగ్లీష్ పాటలు వింటున్నట్లు వీడియోలో ఉండడం హిందూ సంఘాలకు ఆగ్రహం కలిగించింది. కాగా, రింకూ సింగ్‌కు కాబోయే భార్య ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.
రింకూ సింగ్.. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు, రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టులో సభ్యుడు.


