కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఏర్గట్ల రోడ్లపై యమ ధర్మరాజు (Yamadharma Raju) ప్రత్యక్షమయ్యాడు.. “హెల్మెట్ పెట్టుకుంటావా..? లేకపోతే పాశం విసురుమంటావా..?” అని అడుగుతున్నాడు.. “సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తావా..? కారులో సీటు బెల్టు పెట్టుకోవా..? ఇవన్నీ పాటిస్తేనే ఇళ్లకి వెళ్తావు.. లేదంటే మాతో యమలోకానికి వస్తావ్” అంటూ చెబుతున్నాడు.. నిబంధనలు పాటించని వాహనదారులకు యమపాశం వేస్తున్నాడు ఈ యముడు.. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన జనం అసలు విషయం తెలుసుకొని ఆలోచనలో పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలోని ఏర్గట్ల పోలీసు స్టేషన్ ఎస్సై పడాల రాజేశ్వర్ (SI Padala Rajeshwar) యముడి వేషం వేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ రోడ్లపై వినూత్న ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ ధరించని వాహన దారులను, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని సీటు బెల్టు పెట్టుకోని వారిని ఆపి వారికి పాశం వేస్తున్నారు. నిబంధనలు పాటిస్తే ప్రాణాలు దక్కుతాయని లేదంటే తమతో రావాల్సి వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.
షార్ట్ ఫిలిం రూపొందించిన ఎస్సై
హెల్మెట్ వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ 5 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఆ ఫిలింను సీపీ సాయి చైతన్య ఆవిష్కరించారు. ఈ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించకపోతే జరిమానాలను వసూలు చేయడంతో పాటు నిబంధనలను పాటించేలా చైతన్యం తీసుకరావడం కూడా ముఖ్యమని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ (Nizamabad) పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్ల ఆధ్వర్యంలో వాహనదారులకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో జరిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. హెల్మెట్ ఆవశ్యకతను రోడ్డు భద్రతా నిబంధనలు వివరిస్తూ పోలీసులు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు బాగున్నాయని జనాలు అభినందిస్తున్నారు.
Read Also: కృష్ణంరాజు బర్త్ డే.. ఈ పేషెంట్లకు శుభవార్త
Follow Us On: X(Twitter)


