కలం, వెబ్‌డెస్క్: ఆకాశంలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించనుంది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు రానున్నాయి (Planetary Parade). ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇది జరగనుంది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన గంట తర్వాత బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనస్ (వరుణ), నెప్ట్యూన్ (ఇంద్ర) గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. ఈ మేరకు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలా గ్రహాలన్నీ ఒక వరుసలో కనిపించడాన్ని గ్రహాల పరేడ్‌గా పిలుస్తారు.
ఫిబ్రవరి 28 సాయంత్రం ఏర్పడే ఈ ఖగోళ అద్భుతంలో.. బుధుడు, శుక్రుడు, గురుడు, శని గ్రహాలను నేరుగా చూడవచ్చు. ఇవి ప్రకాశవంతంగా ఉండడంతో వీటిని చూడడానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు. మిగిలిన రెండు గ్రహాలను మాత్రం బైనాక్యులర్స్, లేదా టెలిస్కోప్‌లు అవసరం.
ఆకాశంలో అప్పుడప్పుడూ ఒకే వరుసలో రెండు లేదా మూడు గ్రహాలు కనిపించడం సాధారణమే. అయితే, ఇలా ఒకేసారి ఆరు గ్రహాలు (Planetary Parade) కనిపించడం మాత్రం అరుదైన విషయం. ప్రతి గ్రహానికి తనదంటూ ప్రత్యేక కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల, ఇలాంటి అరుదైన సంఘటనలు కొన్ని వందల ఏళ్లకు ఒకసారి మాత్రమే ఏర్పడతాయి.
వాస్తవంగా గ్రహాలు ఒకే వరుసలో ఉండవు. భూమి నుంచి చూసినప్పుడు అవి ఒకే వైపున దగ్గర, దగ్గరగా ఉండడం వల్ల ఒకే రేఖలో ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే, ఒక రాత్రిలో ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించడం మాత్రం వందల ఏళ్లకు ఒకసారి జరిగే ఖగోళ అద్భుతం. విద్యార్థులు, ఖగోళ శాస్త్రవేత్తలకు సౌర కుటుంబంలోని వింతలు, వైవిధ్యాన్ని చూడడానికి ఒక గొప్ప అవకాశం.


