కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతిలో మరోసారి కేసీఆర్ ఫోటోపై చర్చ మొదలయింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ పార్టీతో పాటు ముఖ్యనేతలపై జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు కూడా కవిత దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనం బాట కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నానని కవిత ప్రకటించారు. అన్నట్టుగానే జాగృతి జనం బాటలో కేసీఆర్ ఫోటో లేకుండానే ముందుకు వెళ్లారు కవిత.
కొన్ని రోజుల క్రితం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా కవిత ప్రకటించారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కారాలు, వనరుల అధ్యయనం కోసం 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో ఆమె సమావేశం అయ్యారు. తమ అధ్యయనంపై ప్రాథమిక నివేదికను వివిద కమిటీల సభ్యులు అందజేశారు. కమిటీ నివేదికతో తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ రూపొందించేందుకు జాగృతి ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాభిప్రాయం మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని కమిటీలు నివేదికలో సూచించాయి.
జాగృతి స్టీరింగ్ కమిటీ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఫోటోపై జాగృతి విభాగాలు నజర్ వేశాయి. హాల్ లో ఉన్న గోడపై కేసీఆర్ – కవిత ఫోటోల ఫ్రేమ్ అందరిని ఆకర్షించింది. ఈ క్రమంలో స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో పెట్టారు. బ్యానర్లో జయశంకర్ ఫోటో మాత్రమే పెట్టి గోడలకు తండ్రితో దిగిన ఫోటోలు పెట్టడం జాగృతిలో తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also: ఖమ్మం జిల్లాలో కొత్తగా లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: Instagram


