కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కయ్యం నడుస్తోందా..? జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సైతం ఇక్కడ అడుగుపెట్టేందుకు వణికిపోతున్నారా..? అంటే పరిస్థితి చూస్తే అవుననే సమాధానం విన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు నల్లగొండ జిల్లాకు (Nalgonda) ఇన్చార్జ్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ను నియమించి దాదాపు 8 నెలలు కావొస్తోంది. ఇప్పటివరకు ఆయన జిల్లాలోకి అడుగుపెట్టకపోవడం.. కాదు కాదు.. అడుగుపెట్టనీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇన్చార్జ్ మంత్రి అంటే.. జిల్లాలో చీమ చిటుక్కుమన్న ఆ మంత్రికి తెలియాల్సిందే. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పాలి. ఇక్కడి రాజకీయ పరిస్థితులో.. లేక కాంగ్రెస్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరో.. తెలియదు గానీ జిల్లా ఇన్చార్జ్ మంత్రికి ద్వారాలు తెరుచుకోవడం లేదు. అధికారులు సైతం ఆయన్ను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న దాఖలాలెక్కడ కన్పించడం లేదు.
అసలు అడ్లూరిని అడ్డుకుంటుందేవరు..?
బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల హయాంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఊసేలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించారు. అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మొదట ఇన్చార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించగా ఆ సమయంలో మంత్రి తుమ్మల దాదాపు జిల్లాలోని ప్రతి అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేవారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.. ఇలా ప్రతి అధికారిక, అనధికారిక కార్యక్రమాలు తుమ్మల నోటీసులో ఉండేవి. పలుమార్లు రివ్యూ సమావేశాల్లోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులు, ఇన్చార్జ్ మంత్రికి మధ్య కొంతమేర గ్యాప్ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగించారు.
ఇన్చార్జ్ మంత్రి అన్నమాటే గానీ ఏనాడూ జిల్లాలో పర్యటించింది లేదు. రివ్యూల్లోనూ పాల్గొనలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ (Devarakonda) నియోజకవర్గంలో పర్యటించినా.. మంత్రి అడ్లూరి మాత్రం పాల్గొనలేదు. ఇదంతా జిల్లా మంత్రుల మధ్య ఆధిపత్య పోరు వల్లేననే ఆరోపణలు లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలో ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడుగుపెడితే.. ఊరుకోబోమంటూ జిల్లా కీలక ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారని సమాచారం. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో టీపీసీసీ చీఫ్ హోదాలో జిల్లాలోకి రేవంత్ రెడ్డిని ఏనాడూ అడుగుపెట్టనీయలేదు. అలాంటిది నిన్ను ఏలా రానీస్తామంటూ మంత్రి అడ్లూరిపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగానే ఇన్చార్జ్ మంత్రి జిల్లాలో అడుగుపెట్టకపోవడం గమనార్హం. ఇటీవల వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన మంత్రి అడ్లూరి.. నల్లగొండ వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.
మున్సిపల్ ఎన్నికల ముప్పు..
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఇతర జిల్లాల్లో ఇన్చార్జ్ మంత్రులు ప్రచారం నిర్వహించారు. కానీ నల్లగొండలో మంత్రి ఇన్చార్జ్ మంత్రి ప్రవేశంపై నిషేధం విధించినట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు బాధ్యతలను అడ్లూరి లక్ష్మణ్‌ను అప్పగించారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావడం కష్టమనే చెప్పాలి. ‘మా జిల్లాలో మా పెత్తనమే కొనసాగాలి’ అనే తరహాలో ఇక్కడి నేతల వ్యవహారం మారింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు డోలాయమానంలో పడాల్సిందే. జిల్లాలో ఇంత జరుగుతున్నా.. టీపీసీసీ ఇటువైపు కన్నెత్తిచూడడం లేదని పార్టీ వర్గాల్లో చర్చనడుస్తోంది.

Read Also: మహిళా అధికారులపై నిరాధార వార్తలు రాస్తారా: రేణుకా చౌదరి
Follow Us On: Sharechat


