కలం, వెబ్ డెస్క్: ’వీధి కుక్కలను చంపేస్తారా? మీకసలు బుద్ధి ఉందా? కుక్కలకు ఈ దేశంలో బతికే హక్కు లేదా? ఒక కుక్క ఎవరినో కరిచిందని మొత్తం కుక్కలను హతమారుస్తారా?‘ అంటూ ప్రముఖ నటి రేణు దేశాయ్ (Renu Desai) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారంటూ ఫైర్ అయ్యారు. సోమవారం ఆమె సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
‘సమాజంలో కొందరు మగాళ్లు రేప్ చేస్తున్నారు.. కొందరు హత్యలు చేస్తున్నారు.. అలా అని అందరు మగాళ్లను రేపిస్టులు, హంతకులు అంటామా?. మగాళ్లను చంపేస్తామా?’ అంటూ ఆమె తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ‘కుక్క వల్ల చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒక కుక్క చేసిన పనికి మొత్తం కుక్కలను బలి చేయడం అన్యాయం‘ అంటూ ఆమె అభిప్రాయపడ్డారు.
‘వీధి కుక్కల విషయంలో చాలా రోజులుగా నేను సైలెంట్‌గా ఉన్నాను. ఈ దేశంలో న్యాయం ఉందని అభిప్రాయపడ్డాను. నా కంటే ఎక్కువ చదువుకున్న వాళ్లు న్యాయమూర్తులుగా ఉన్నారని మౌనంగా ఉన్నాను. ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని పోస్టులు పెట్టాను తప్ప పెద్దగా స్పందించలేదు. కానీ కొందరి ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. కుక్కలను ఎలా చంపేస్తున్నారు. 40 కుక్కలను దారుణంగా హత్య చేశారు. చిన్న పిల్లలను కుక్కలు కరుస్తుంటే.. అటువంటి కుక్కలను తీసుకెళ్లండి. ఎన్జీవోలను సంప్రదించండి. అన్ని కుక్కలు చెడ్డవి కాదు.‘ అంటూ రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.
ఏ మతం వారు అయినా.. కుక్కల పట్ల మానవత్వం ఉండాలి. మనుషులకు మాత్రమే జీవించే హక్కు ఉందా? కుక్కలకు హక్కులు ఉండొద్దా? వాటి పట్ల కనికరం చూపించండి.. నాలుగు కుక్కలు చనిపోతే నాలుగు వందల కుక్కలను చంపుతారా?’ అంటూ రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ లా కాలేజీ విద్యార్థుల తీరుపై ఆమె ఫైర్ అయ్యారు.
‘కుక్క అయినా, మనిషి అయినా గోవు అయినా ఒక్కటే.. ఏ జీవి అయినా ఒక్కటే‘ అంటూ ఆమె అభిప్రాయపడ్డారు. కర్మ ఎవరినీ తప్పించదని కుక్కలను చంపేవారిని దేవుడే శిక్షాడాని పేర్కొన్నారు. కుక్కలు దైవస్వరూపమని.. కాలభైరువులుగా కొలుస్తామంటూ చెప్పుకొచ్చారు. కాగా రేణుదేశాయ్ వ్యాఖ్యల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంతుప్రేమికులు ఆమెను సపోర్ట్ చేస్తుండగా.. కొందరు నెటిజన్లు ఆమె తీరును తప్పుపడుతున్నారు.

Read Also: సిద్దిపేట జిల్లాలో దారుణం
Follow Us On: X(Twitter)


