కలం, మెదక్ బ్యూరో: అనుమానం పెనుభూతమైంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేశాడు. అడ్డొచ్చిన కూతురిని సైతం రోకలిబండతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ కాలనీ స్ట్రీట్ నంబర్ 7లో ఎల్లయ్య తన భార్య శ్రీలతతో కలిసి ఉంటున్నాడు. అతడికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. చాలా రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. భార్యను నిత్యం ఎల్లయ్య అనుమానించేవాడని.. పిల్లలు కూడా తనకు పుట్టలేదని భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శ్రీలత పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీపెట్టి భార్యాభర్తలకు సర్దిచెప్పారు. ఇటీవలే ఎల్లయ్య తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మరోసారి గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన ఎల్లయ్య తన భార్యకు ముందుగా క్రిమిసంహారక మందు బలవంతంగా తాగించాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి హత్యచేశాడు. అడ్డొచ్చిన కూతురు మీద రోకలిబండతో దాడి చేశాడు. అనంతరం తానూ గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య శ్రీలత అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు గమనించి కూతురును ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎల్లయ్య కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లయ్య పక్కా ప్లాన్ ప్రకారమే తమ కూతూరిని చంపేశాడని శ్రీలత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


