కలం, వెబ్ డెస్క్: టీమిండియా జట్టులో నితీష్ కుమార్ (Nitish Kumar) స్థానంపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మాత్రమే కాకుండా తొలి వన్డే నుంచి ఆడి ఉండాల్సిందని అన్నాడు. మూడో వన్డేలో అతను చూపిన ఆల్‌రౌండ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని, రానున్న మ్యాచ్‌లలో అతను విఫలమైనా జట్టు అతనితో కొనసాగాలని పఠాన్ స్పష్టం చేశాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో రెండో వన్డేలో జట్టులోకి వచ్చిన నితీశ్‌కు ఆ మ్యాచ్‌లో పెద్దగా అవకాశం దక్కలేదు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో మాత్రం ఎక్కువ బాధ్యతలు అప్పగించారు. బౌలింగ్‌లో వికెట్లు తీయలేకపోయినా బ్యాటింగ్‌లో కీలకంగా రాణించాడు. విరాట్ కోహ్లీతో కలిసి 88 పరుగుల భాగస్వామ్యంలో 53 పరుగులు చేసి జట్టుకు బలం చేకూర్చాడు.
తన యూట్యూబ్ వీడియోలో పఠాన్ నితీశ్‌ను ఈ సిరీస్‌లో ప్రధాన పాజిటివ్‌గా పేర్కొన్నాడు. బౌలింగ్‌లో గంటకు 135 కిలోమీటర్ల వేగాన్ని తాకిన అతనిలో భవిష్యత్తులో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా మారే సామర్థ్యం ఉందని అన్నాడు. నితీశ్ బ్యాటింగ్‌లో పెద్ద షాట్లు ఆడగలడని పఠాన్ వివరించాడు. స్ట్రైక్ మార్చే నైపుణ్యం ఉన్నాడని తెలిపాడు. రెండు మ్యాచ్‌లలోనూ మంచి భాగస్వామ్యాలు నిర్మించాడని చెప్పాడు. నితీశ్ విఫలమైనా జట్టు అతనిపై నమ్మకం కొనసాగిస్తే భారత్‌కు ఒక మంచి ఆల్‌రౌండర్ దొరుకుతాడని అభిప్రాయపడ్డాడు.


