కలం, వెబ్ డెస్క్: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి భారతీయ జనతాపార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లకు కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఎన్‌సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని ‘బ్రిటిష్ జనతా పార్టీ’ అంటున్నారు. కానీ కాంగ్రెస్‌ను ఒక బ్రిటిష్ అధికారి స్థాపించాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు.’ అంటూ Bandi Sanjay కౌంటర్ ఇచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును వాడుకొని ఆశయాలను పక్కనపెట్టిందని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను బీజేపీ నెరవేరుస్తోందని చెప్పారు. ‘విభజించి పాలించు’ అని కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ల కోసం కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తోందని ఫైర్ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అనే మార్గంలో పనిచేస్తోందని చెప్పారు. ఇళ్లు, రేషన్, గ్యాస్ వంటి పథకాలు మత భేదం లేకుండా పేదలందరికీ అందుతున్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ 70 ఏళ్లుగా పెంచిన బానిస మనస్తత్వాన్ని బీజేపీ తొలగిస్తోందని చెప్పుకొచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సు పెట్టాలని తాను సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానని చెప్పారు. ‘ఆ కోర్సులో మొదటి విద్యార్థి సీఎం రేవంత్ రెడ్డి కావాలి.. ఎందుకంటే ఆయనలో రాజకీయ నైపుణ్యం లోపిస్తున్నట్టు కనిపిస్తోంది’ అంటూ బండి వ్యాఖ్యానించారు.


