కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. భారీ స్కోర్లు చేయలేదు. దీంతో అతడి ఫామ్‌పై పలు ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా వీటికి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బదులిచ్చాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ భారీ స్కోర్లు చేయలేకపోయినా… అతని ఫామ్‌పై ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తేల్చిచెప్పాడు. ప్రతిసారి పెద్ద ఇన్నింగ్స్ వస్తాయనే హామీ ఉండదని, ప్రస్తుతం రోహిత్ (Rohit Sharma) అద్భుతమైన టచ్‌లోనే ఉన్నాడని గిల్ పేర్కొన్నాడు. ‘భారత్‌లో సాధారణంగా హైస్కోరింగ్ మ్యాచ్‌లు చూస్తాం. బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినప్పుడు కనీసం ఇద్దరైనా వాటిని పెద్ద స్కోర్లుగా మార్చాలి. ఈ సిరీస్‌లో మేము అక్కడే విఫలమయ్యాం” అని గిల్ అంగీకరించాడు.
ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో ఓడిపోవడంతో న్యూజిలాండ్ 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది. భారతగడ్డపై కివీస్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం. ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 61 పరుగులే చేశాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్ గురించి గిల్ మాట్లాడాడు. “ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌ల్లో రోహిత్ అద్భుతంగా ఆడాడు. అతను ఇప్పటికీ సూపర్ ఫామ్‌లోనే ఉన్నాడు. ప్రతీ ఆరంభాన్ని సెంచరీగా మార్చడం సాధ్యం కాదు” అని అన్నాడు. జడేజా, కుల్దీప్‌లను కూడా గిల్ వెనకేసుకొచ్చాడు. “జడేజా ఈ సిరీస్‌లో విఫలమైనా మంచి టచ్‌లోనే ఉన్నాడు. అసలు సమస్య ఏమిటంటే… మేము బ్యాటర్లం మంచి స్టార్ట్స్‌ను పెద్ద స్కోర్లుగా మార్చలేకపోయాం” అని గిల్ (Shubman Gill) అభిప్రాయపడ్డాడు.


