కలం, వెబ్ డెస్క్: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కోసం పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం ఆయన తన పాదయాత్రకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఎంతో బాధపడ్డానని అన్నారు. జైలు నుంచి చంద్రబాబు విడుదలైతే తిరుమలకు నడిచి వస్తానని వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, మొక్కిన నాలుగు రోజులకే చంద్రబాబుకి బెయిల్ వచ్చి బయటికొచ్చారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై పెట్టిన కేసు వారం క్రితమే కొట్టేశారని, అందుకే సంకల్ప యాత్ర చేస్తున్నానని ఆయన వెల్లడించారు. 20 రోజుల్లో తిరుమలకు తన పాదయాత్ర పూర్తవుతుందని బండ్ల గణేశ్ అన్నారు.
బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన పలు వేదికలపై పవన్‌పై ఎన్నోసార్లు ప్రశంసలు కురిపించారు. ‘పవన్ నా దేవుడు’ అంటూ ప్రకటించుకున్నాడు కూడా. అలాంటి బండ్ల గణేశ్ చంద్రబాబు (AP CM Chandrababu) కోసం సంకల్ప యాత్ర చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
కాగా బండ్ల గణేశ్‌పై నటుడు శివాజీ కామెంట్స్ చేశారు. ‘‘ఆయనకు పార్టీలతో సంబంధం లేదు. ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశానని ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ పరుడు. చంద్రబాబు బండ్ల గణేశ్‌కు చేసేందేమీ లేదు. కానీ సమాజానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు అరెస్ట్ అవడంతో బయటికి రావాలని దేవుడికి మొక్కాడు’’ అని శివాజీ అన్నారు.


