కలం వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)కి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. “21వ శతాబ్దానికి నాయకత్వం” అనే శీర్షికతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భారత్ నుంచి హాజరవుతున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించనున్నారు. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలవనున్నారు.
ఐవీ లీగ్ యూనివర్సిటీ అయిన హార్వర్డ్‌లో అధికారిక లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరవుతున్న తొలి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయనే కావడం గమనార్హం. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 25 నుంచి 30 వరకు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం, కేంబ్రిడ్జ్ నగరంలో ఉన్న కెన్నెడీ స్కూల్ క్యాంపస్‌లో తరగతులకు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాల్లోని ఇరవైకిపైగా దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నాయకులు, విధాన నిర్ణయకర్తలు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కోర్సులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి తరగతులు వినడమే కాకుండా, అసైన్‌మెంట్‌లు పూర్తి చేయడం, హోమ్ వర్క్‌లు సమర్పించడం, ఇతర దేశాల ప్రతినిధులతో కలిసి గ్రూప్ ప్రాజెక్టులు నిర్వహించడం వంటి బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, భిన్న కాలాలు, చారిత్రక సందర్భాలకు సంబంధించిన కేస్ స్టడీలను విశ్లేషించి వాటికి పరిష్కారాలను రూపొందించి తరగతుల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ప్రొఫెసర్ టిమ్ ఓబ్రియన్ ప్రోగ్రామ్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ కేరన్ మోరిస్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమం ముగింపు అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హార్వర్డ్ యూనివర్సిటీ తరఫున అధికారికంగా ‘కోర్సు సర్టిఫికేట్’ అందుకోనున్నారు.
Read Also: పత్తాలేని ట్రామాకేర్ సెంటర్లు.. యాక్సిడెంట్ అయితే ప్రాణాలు హరి
Follow Us On: Sharechat


