కలం, వెబ్ డెస్క్ : తులసీ వనంలో గంజాయి మొక్కకు చోటు ఉండదని, ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి వచ్చినా ఈ జిల్లాలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని, కనీసం సర్పంచులు కూడా లేని పరిస్థితి అక్కడ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీని ఆయన ‘బ్రిటిష్ జనతా పార్టీ’గా అభివర్ణించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు SIR తీసుకువచ్చారన్నారు. పేదల ఓటు హక్కును కాలరాసేలా వారి చర్యలు ఉన్నాయని సీఎం ఆరోపించారు. ఒకవేళ ఓటు హక్కు కోల్పోతే పేదలకు అందే రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు అన్నీ పోతాయని ఆయన పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్, కమ్యూనిస్టులు అనే తేడా లేకుండా మోదీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ సభ కాలం నుంచే పేదలకు ఓటు హక్కు లేకుండా చేయాలని చూసిన శక్తుల వారసులే నేటి బీజేపీ నాయకులని మండిపడ్డారు.
పేదల హక్కుల కోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్లకు ముఖ్యమంత్రి వందనం చేశారు. దున్నేవాడిదే భూమి అన్న కమ్యూనిస్టుల నినాదాన్ని ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు వంటి నాయకులు ఆచరణలోకి తెచ్చారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు మరువలేనివని కొనియాడారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి మహనీయుల పోరాట ఫలితంగానే నిజాం విముక్త హైదరాబాద్ సాధ్యమైందని చెప్పారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. పేదలను అగ్గువకో సగ్గువకో అదానీ, అంబానీలకు కూలీలుగా మార్చేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రభుత్వంలో కమ్యూనిస్టుల శ్రమ కూడా ఉందని, పేదల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.


