కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ గనుక రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవారా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మారిన పాలమూరు ముఖచిత్రాన్ని చూసి కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు తన తండ్రి చనిపోతే స్నానానికి నీళ్లు లేవని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు జిల్లాలో అవే పరిస్థితులు ఉన్నాయా అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నిన్నటి సభలో ఇరు పార్టీల నేతలు పరస్పరం పొగుడుకోవడం వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి పథకాలు గుర్తుకొస్తున్నాయని, మళ్లీ చీరలు పంచుతామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. జిల్లాలను రద్దు చేయడం, కేసీఆర్ తెచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టడమే కాంగ్రెస్ నేతల పనిగా మారిందన్నారు.
రాష్ట్రంలో మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మహిళా ఐఏఎస్ అధికారుల పరువును బజారుకు ఈడుస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపై ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం వల్ల దేశంలో తెలంగాణ పరువు పోతోందని, మహిళా అధికారులు పని చేయడానికి భయపడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కట్టిన ఇళ్లు, తెచ్చిన ప్రాజెక్టులు సీఎంకు హెలికాఫ్టర్ నుంచి చూస్తే కనిపిస్తాయని చెప్పారు.


