epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

పాముకు కోరల్లో మాత్రమే విషం.. విపక్షానికి ఒంటి నిండా విషమే : పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో : “పాముకు కేవలం కోరల్లోనే విషం ఉంటుంది.. కానీ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల పాలు చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజా ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారు” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం మద్దులపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన, విపక్షాల తీరును ఎండగట్టారు.

​ప్రజా తీర్పుతో చెంప చెళ్లుమంది :

​అసెంబ్లీ, పార్లమెంటు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లలో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు పట్టం కట్టారని పొంగులేటి గుర్తు చేశారు. “సెమీ ఫైనల్స్ అని కారుకూతలు కూస్తున్న చిచ్చర పిడుగులకు, టిల్లూలకు మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 69 శాతం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోవడం మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండం. ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగాలి. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి” అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

​వృథా జలాలకు అడ్డుకట్ట.. సాగుకు భరోసా..

​జిల్లా ప్రగతిలో సాగునీటి ప్రాజెక్టులు చారిత్రక మైలురాయిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. రూ. 162.54 కోట్లతో నిర్మించే మున్నేరు-పాలేరు లింక్ (Munneru – Paleru Link) కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. రూ. 108.60 కోట్లతో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, రూ. 45.50 కోట్లతో కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జిల్లా యువతకు, పేదలకు వరమని కొనియాడారు.

కార్యకర్తలే నా బలం : పొంగులేటి

​తమను గెలిపించడానికి అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలను ప్రజాప్రతినిధుల స్థానంలో కూర్చొబెట్టే బాధ్యత తమదేనని మంత్రి భరోసా ఇచ్చారు. “మీ కష్టాన్ని నేను మరువను. పేదవాడికి భద్రత, భరోసా కల్పించడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి ఆగదు” అని మంత్రి పొంగులేటి (Ponguleti) స్పష్టం చేశారు.

Read Also: మోదీ ఫ్రెండ్ అంటూనే.. భారత్ ను టార్గెట్ చేస్తోన్న ట్రంప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>