కలం, వెబ్ డెస్క్ : ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్‌దేనని, ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల వల్ల ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Laxma Reddy) విమర్శించారు. ముఖ్యమంత్రి నల్లమల బిడ్డనని చెప్పుకుంటూనే జిల్లా ప్రజల మొహాలు నల్లగా చేసి వెళ్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత పాలకుల వల్లే జిల్లా వెనుకబడిందని సీఎం చెబుతున్న మాటల్లో నిజం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను కేసీఆర్‌కు ఆపాదించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
పాలమూరు రంగారెడ్డి (Palamuru – Rangareddy) ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ (KCR) అని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా, కాంగ్రెస్ నేతలు కోర్టు కేసులతో అడ్డుపడినా, రాష్ట్ర సొంత నిధులతో 80 శాతం పనులను పూర్తి చేశామన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే మరో ఆరు నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. గతంలో పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న వాటన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రావడమే గగనమైన పరిస్థితుల నుంచి, నేడు ఐదు మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్, ఫిషరీస్ కళాశాలలు, 80 గురుకులాలను సాధించుకున్నామని లక్ష్మారెడ్డి (Laxma Reddy) వివరించారు. ముఖ్యంగా మారుమూల పల్లెలకు సైతం రోడ్ల సౌకర్యాన్ని కల్పించి జిల్లా రూపురేఖలను మార్చామన్నారు. కేసీఆర్ కృషితోనే పాలమూరు పచ్చబడిందని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం కేవలం మాటలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పైకి విమర్శించుకుంటూనే లోపల ఒకరినొకరు పొగుడుకుంటున్నారని లక్ష్మారెడ్డి విమర్శించారు. నిన్నటి సమావేశాల్లో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన స్పష్టంగా కనిపించిందన్నారు. దమ్ముంటే రెండు పార్టీలు కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని ఆయన సవాల్ విసిరారు. ఉద్ధండాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గురించి సీఎం ఎందుకు మాట్లాడలేదని, గద్వాలలో క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే జూరాల నీళ్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.
Read Also: బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ: రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


